ICMR: కొవిడ్ తరువాత పెరిగిన ‘ఆకస్మిక మరణాల’పై ఐసీఎమ్ఆర్ అధ్యయనం

  • కరోనా సంక్షోభం తరువాత దేశంలో 18-45 ఏళ్ల వారిలో పెరిగిన ఆకస్మిక మరణాలు
  • ఎటువంటి అనారోగ్యం లేని యువత అకాల మరణాలతో కలకలం
  • ఈ ఘటనలపై దృష్టి సారించిన భారత వైద్య పరిశోధన మండలి
  • కరోనాకు పూర్వం సంభవించిన మరణాలు, ఆ తరువాతి ఘటనలు పోల్చుతూ అధ్యయనం
India Probing sudden Deaths of Youngsters in 2 Big Studies Says ICMR Chief

కొవిడ్ సంక్షోభం తరువాత భారత్‌లో అనేక ఆకస్మిక మరణాలు సంభవించాయి. 45 ఏళ్ల లోపు వయసున్న అనేక మంది ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు లేకపోయినా హఠాన్మరణం చెందిన ఘటనలు వెలుగుచూశాయి. అయితే, కొవిడ్ తరువాతే ఇలాంటి మరణాలు అధికమయ్యాయన్న వాదనలో నిజానిజాలు తేల్చేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) కీలక అధ్యయనం నిర్వహిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ వేదికగా ఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ డా. బాల్ ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. కరోనా సంక్షోణం ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 

ఐసీఎమ్ఆర్ ఆధ్వర్యంలో ఇప్పటివరకూ జరిగిన అధ్యయనంలో భాగంగా నిపుణులు ఎయిమ్స్‌లో జరిగిన 50 పోస్ట్ మార్టం నివేదికలను అధ్యయనం చేశారు. రాబోయే నెలల్లో మరో 100 మరణాలకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికలను పరిశీలించనున్నారు. 

కరోనా సంక్షోభానికి మునుపు సంభవించిన మరణాలతో ఆ తరువాత జరిగిన ఘటనలు పోల్చి మార్పులు సంభవించాయేమో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డా. బాల్ తెలిపారు. ముఖ్యంగా కరోనా సంక్షోభం తరువాత మరణించిన వారి శరీరాల్లో ఏదైనా మార్పులు ఉన్నాయా? అనే దిశగా అధ్యయనం సాగుతోంది. ఈ మరణాల మధ్య సారూప్యతల ఆధారంగా కారణాలు కనుగొనేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 

కాగా,ఈ అధ్యయనంలో ఐసీఎమ్ఆర్ ఓ కంట్రోల్ గ్రూప్‌లోని వారిని కూడా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఆకస్మిక మరణాలు సంభవించిన ప్రాంతాల్లో ఇరుగుపొరుగు వారిని అధ్యయనం చేస్తోంది. మృతుల వయసు, ఇతర లక్షణాలకు దగ్గరగా ఉండి మామూలు ఆరోగ్యంతో ఉన్న వారి వివరాలను సేకరించి ఆకస్మిక మరణాల వెనకున్న కారణాలపై ఓ అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

More Telugu News