Crime News: హైదరాబాద్‌లో ఉన్న భార్యపై లండన్ నుంచి భర్త విష ప్రయోగం

  • మనస్పర్థల కారణంగా భర్తతో దూరంగా ఉంటున్న భార్య
  • భర్తపై లండన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు
  • సోదరుడి వివాహం కోసం హైదరాబాద్ వచ్చిన భార్య
  • తన వద్ద పనిచేసే వినోద్ కుమార్, హైదరాబాద్‌లోని మరికొందరితో కలిసి కుట్ర
  • కారం, మసాలా పొడుల్లో విషం కలిపి శాంపిల్స్ అంటూ డెలివరీ బాయ్ రూపంలో అందజేత
  • వాటిని వాడడంతో కుటుంబమంతా అనారోగ్యంపాలు
  • మృతి చెందిన శిరీష తల్లి ఉమామహేశ్వరి
  • అనుమానంతో రక్త పరీక్ష చేయించుకోవడంతో కుట్ర వెలుగులోకి
  • హైదరాబాద్‌లోని నిందితులందరూ అరెస్ట్
The husband from London poisoned his wife in Hyderabad

మనస్పర్థల కారణంగా తన నుంచి దూరంగా ఉంటూ సోదరుడి వివాహానికి హైదరాబాద్ వచ్చిన భార్యపై లండన్ నుంచి విష ప్రయోగం చేయించాడో భర్త. విషయం బయటపడడానికి ముందే అతడి అత్తయ్య ప్రాణాలు కోల్పోయింది. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన డాక్టర్ శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం. అజిత్‌కుమార్‌తో వివాహమైంది. ఆ తర్వాత వారు లండన్‌లో స్థిరపడ్డారు. కుమార్తె జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారు విడివిడిగానే ఉంటున్నారు.

తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెతోపాటు కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నాడు. అందుకు లండన్‌లో తనవద్ద పనిచేసే వినోద్‌కుమార్‌ను ఒప్పించాడు. హైదరాబాద్‌లో ఉండే భవానీశంకర్, అశోక్, గోపినాథ్‌తోపాటు నిందితుడు అజిత్ స్నేహితుడు, శిరీశ్ బంధువైన పూర్ణేందర్‌రావుతో కలిసి కుట్రపన్నారు. ఈ క్రమంలో సోదరుడి వివాహం కోసం కుమార్తెతో కలిసి శిరీష హైదరాబాద్ రావడాన్ని అవకాశంగా తీసుకుని అందరూ కలిసి ప్లాన్ అమలు చేశారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కుమారుడు రమేశ్‌కు కొంత నగదు ఇచ్చి అత్తారింటిపై నిఘా పెట్టారు.

ప్లాన్ అమల్లో భాగంగా జూన్ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లు తీసుకుని శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అయితే, ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరో ప్లాన్ రచించారు. ఈసారి డెలివరీ బాయ్ రూపంలో విషం కలిపిన మసాలా పొడులు, పసుపు, కారం వంటివాటిని శాంపిల్ ప్యాకెట్ల రూపంలో అందజేశారు. కూరల్లో వాటిని వాడడంతో ఇంట్లోని ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో జులై 5న డాక్టర్ శిరీష తల్లి ఉమామహేశ్వరి మృతి చెందారు. అనారోగ్యమే ఆమె మృతికి కారణమని భావించారు. అయితే, శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోవడంతో అనుమానం వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవడంతో కుట్ర బయటపడింది. రక్తంలో విషపు నమూనాలు ఉండడంతో శిరీష గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష ఇంటివద్దనున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కుమారుడు రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం గుట్టు రట్టయింది. కుట్రకు సహకరించిన మొత్తం ఆరుగురినీ శుక్రవారం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడైన శిరీష భర్త అజిత్‌కుమార్‌ను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News