Anasuya: భోరున విలపిస్తూ అనసూయ... వీడియో వైరల్

  • సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే నటి అనసూయ
  • తాజా పోస్టుతో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం
  • ఏడ్వాల్సి వస్తే ఏడ్చేయాలన్న అనసూయ
  • మనుషులు, మనస్తత్వాలపై ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
Anasuya cries as the video went viral

సోషల్ మీడియాలో ఎంతో క్రియాశీలకంగా ఉండే టాలీవుడ్ నటి అనసూయ తాజా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టులో పంచుకున్న వీడియోలో అనసూయ భోరున ఏడుస్తుండడం చూడొచ్చు. ఈ పోస్టు కింద అనసూయ వివరణ ఇచ్చారు. 

ఈ పోస్టు చూసి అందరూ అయోమయానికి గురవుతారని తనకు తెలుసని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, సోషల్ మీడియా అంటే వ్యక్తుల మధ్య సంబంధాలను పెంపొందించడం, ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకోవడం, పరస్పరం సంస్కృతి, జీవన విధానాలను అనుభూతి చెందడం, సంతోషాన్ని వ్యాపింపచేయడం... వంటి అంశాల కోసం అనుకుంటారని వెల్లడించారు. కానీ ఇవాళ సోషల్ మీడియా చూస్తే వీటిలో ఒక్కటైనా కనిపిస్తోందా అంటూ అనసూయ విస్మయం వ్యక్తం చేశారు. 

"ఈ పోస్టు ఎందుకు పెట్టానో చెబుతాను. ఫొటోలకు పోజులివ్వడం, కెమెరా ముందు ఫొటో షూట్లు, సంతోష సమయాలు, నవ్వులు, డ్యాన్సులు, మాటకు మాట బదులివ్వడాలు, ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడడం... ఇవన్నీ నా జీవితంలో ఒక భాగం అయ్యాయి. 

కొన్నిసార్లు నేను బలహీనపడిన క్షణాలు ఉన్నాయి, సమస్యలను దీటుగా ఎదుర్కోలేని సమయాలు ఉన్నాయి, కుంగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఏడుపు వస్తే ఏడ్చేయాలి... మళ్లీ చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రపంచం ఎదుటకు రావాలి. విశ్రాంతి తీసుకోండి... పునరుజ్జీవం పొందండి... అంతేకానీ, సమస్యల నుంచి పారిపోవద్దు. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని నిందిస్తేనో, నిరాదరణకు గురిచేస్తేనో.... అతడికి లేదా ఆమెకు ఆ రోజు మంచి రోజు కాదేమో అనుకోండి. వారి మనసులో ఎలాంటి దురాలోచనలు ఉన్నాయో ఊహించడానికి ప్రయత్నించండి. 

కనీసం వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినప్పటికీ, ఎదుటవాళ్ల గురించి ఏమీ తెలియనప్పటికీ ఇతరులను బాధించడానికి వారు చేసే పనులను గమనించండి. వారికి కనీస మానవత్వం ఇవ్వు దేవుడా అని ప్రార్థించండి. ఇప్పుడు నేనిలాగే ఆలోచిస్తున్నాను. ఇప్పటికిప్పుడైతే నేను బాగానే ఉన్నాను. ఈ వీడియోలోని క్షణాలు ఐదు రోజుల నాటివి" అని అనసూయ వివరించారు.

More Telugu News