Rail Accidents: ఒకే రోజు రెండు రైళ్లలో అగ్ని ప్రమాదాలు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు

  • మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
  • బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు
  • రెండు ఘటనల్లోనూ ప్రయాణికుల సురక్షిత
  • మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • ప్రమాద కారణాలపై విచారణ
Two Fire Accidents in trains in same day

దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలో ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని మర్చిపోకముందే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. తాజాగా ఈ ఉదయం మరో రెండు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాగా, మరోటి బెంగళూరు రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పూర్ సమీపంలో నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు భయంతో కిందికి దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.  ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అయితే, ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత ప్రమాదం సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కూడా కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News