Congress: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫార్ములా.. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

Congress Clones Karnataka Election Plan To Take Down BJP In Madhya Pradesh

  • కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వంపై ‘40 శాతం కమిషన్’ అంటూ ఆరోపణలు
  • మధ్యప్రదేశ్‌లో ‘50 శాతం కమిషన్ ప్రభుత్వం’ అని విరుచుకుపడుతున్న కాంగ్రెస్
  • కర్ణాటకలో ఇచ్చిన హామీలనే ఇక్కడా ప్రకటిస్తున్న కాంగ్రెస్
  • ఇప్పటికే 39 మంది అభ్యర్థులను ప్రకటించిన మధ్యప్రదేశ్ బీజేపీ
  • కాంగ్రెస్‌కు అభ్యర్థులను ప్రకటించే దమ్ములేదంటూ విమర్శలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీదున్న కాంగ్రెస్.. అక్కడ అనుసరించిన ఫార్ములానే మధ్యప్రదేశ్‌లోనూ ఫాలో కావాలని భావిస్తోంది. కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైనా అవినీతి ఆరోపణలు చేస్తోంది. అయితే,  కాంగ్రెస్ వ్యూహాన్ని ముందే గుర్తించిన అధికార బీజేపీ కూడా ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. 

ఈ రోజు తాను వందశాతం నెరవేర్చగలిగే హామీలను ఇస్తున్నానని, కర్ణాటకలోనూ తాము ఇవే వాగ్దానాలు చేశామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్ పాస్ చేసినట్టు పేర్కొన్నారు. జూన్ 12న జబల్‌పూర్ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రతి నెల మహిళలకు రూ. 1500 పంపిణీ చేస్తామని, గ్యాస్ సిలిండర్‌ను రూ. 500కు ఇవ్వడంతోపాటు 100 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. 200 యూనిట్ల వరకు ధరను సగానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని, పేద రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని వివరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఐదు హామీలను నెరవేర్చుతామని పేర్కొన్నారు. 

గతంలో కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న రణ్‌దీప్ సూర్జేవాలా మధ్యప్రదేశ్ చార్జ్ తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ వ్యూహం మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ‘40శాతం కమిషన్’ అంటూ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు బాగా పనిచేశాయి. వాటిని తిప్పికొట్టడంలో విఫలమైన బీజేపీ మూల్యం చెల్లించుకుంది. అదే వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తూ ఈసారి 10శాతం పెంచి.. ‘50శాతం కమిషన్’ అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. కుంభమేళా సహా దేన్నీ బీజేపీ ప్రభుత్వం వదల్లేదని, అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. కుంభమేళా, సింహస్త మేళా, మహాకాళ్ ఆలయ నిర్మాణంలోనూ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ.. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తాము దీటుగా బదులిస్తామని చెప్పారు.  కాగా, ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ భయపడుతోందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు.

Congress
Madhya Pradesh
Priyanka Gandhi
Karnataka
Assembly Elections
  • Loading...

More Telugu News