Railway Station: బెంగళూరు రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. రెండు బోగీలలో మంటలు.. వీడియో ఇదిగో!

Fire in two coaches of Udyan Express at Bengaluru Railway Station
  • స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయి గందరగోళం
  • ప్రయాణికులు అంతా క్షేమమేనన్న అధికారులు
  • ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారుల విచారణ
బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో హాల్ట్ చేసిన ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ మొత్తం పొగ నిండిపోయి గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

ఉదయన్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం 5:45 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ కు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్లాట్ ఫాం నెంబర్ 3 పైన హాల్ట్ చేశామని వివరించారు. అయితే, ఉదయం 7:10 గంటల ప్రాంతంలో ట్రైన్ లోని బీ 1, బీ 2 కోచ్ లలో పొగలు రావడం మొదలైందని తెలిపారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగసిపడ్డాయని, దీంతో ప్లాట్ ఫాం పైనున్న ప్రయాణికులను అక్కడి నుంచి తరలించామని చెప్పారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పేశారని సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో అనీశ్ హెగ్డే మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.



Railway Station
Fire Accident
train bogies
Karnataka
Bengaluru

More Telugu News