Warangal Rural District: బిడ్డకు స్తన్యమిచ్చి.. కాసేపటికే గుండె ఆగడంతో బాలింత మృతి

  • వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వాసుపత్రిలో ఘటన
  • ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న బిడ్డకు పాలిచ్చి వచ్చిన కాసేపటికే మృతి 
  • వైద్యులు వెంటనే సీపీఆర్ చేసినా దక్కని ఫలితం
  • శోకసంద్రంలో కూరుకుపోయిన యువతి కుటుంబం
warangal woman dies due to cardiac arrest few hours after feeding her new born baby

వరంగల్ సీకేఎం ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న నవజాత శిశువుకు స్తన్యమిచ్చి వచ్చిన ఓ బాలింత ఆ తరువాత కాసేపటికే కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే, వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత(25) ప్రసవం కోసం ఈ నెల 13న సీకేఎం ఆసుపత్రిలో చేరింది. 16న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువుకు అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యులు ఆసుపత్రిలోని నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఈ క్రమంలో సుస్మిత ఎప్పటిలాగే శుక్రవారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ప్రత్యేక వార్డులోని తన బిడ్డకు స్తన్యమిచ్చి వచ్చి తన బెడ్‌పై పడుకుంది. కానీ, ఉదయం 6 కావస్తున్నా ఆమె చలనం లేకుండా పడుకుని ఉండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. సుస్మితను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆమెలో కదలికలు కనిపించలేదు. విషయం తెలిసి ఆమెను పరీక్షించిన వైద్యులు అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో మరణించిందని తేల్చారు. ఆమెకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. సుస్మిత మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 


More Telugu News