3D Printed Post Office: దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్.. ప్రింటింగ్ వీడియో ఇదిగో!

  • త్రీడీ పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • కేవలం 45 రోజుల్లోనే పూర్తయిన వెయ్యి చదరపు అడుగుల బిల్డింగ్
  • బెంగళూరులోని హాలాసూర్ లో ప్రారంభోత్సవం
Indias First 3D Printed Post Office inaugurate by Union Minister Ashwini Vaishnaw

దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ బిల్డింగ్ ను కేవలం 45 రోజుల్లో పూర్తిచేసినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. బెంగళూరులోని హాలాసూర్ కేంబ్రిడ్జి లే అవుట్ లో దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ త్రీడీ బిల్డింగ్ ను రూపొందించారు. ఎల్‌ అండ్ టీ కంపెనీ 3డి కాంక్రీట్ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తిచేసింది. 

బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ బిల్డింగ్ ఒక నిదర్శనమని చెప్పారు. దేశానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ముందు ఉంటుందని, త్రీడీ పోస్టాఫీసు బిల్డింగ్ తో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. యావత్ దేశం ఇదే స్ఫూర్తితో పురోగమిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో తాము ప్రతిపాదించిన త్రీడీ బిల్డింగ్ ప్లాన్ కు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (బీఎంటీపీసీ) ఆమోదం తెలపగా.. ఐఐటీ మద్రాస్ సహకారంతో పూర్తిచేసినట్లు ఎల్ అండ్ టి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News