Pakistan: పాక్ ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా కాశ్మీర్ టెర్రరిస్టు భార్య !

Yasin Malik wife is special adviser to Pakistan caretaker PM
  • కశ్మీర్ తీవ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు పాక్ కేబినెట్ లో చోటు
  • మానవ హక్కుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్న ముషాల్
  • టెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మాలిక్
పాకిస్థాన్ లో ఇటీవల ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఓ టెర్రరిస్టు భార్యకు ప్రాధాన్యం లభించింది. ఆమెను ఏకంగా ఆపద్ధర్మ ప్రధానికి సలహాదారుగా పాక్ కేబినెట్ ఎంపిక చేసింది. జూనియర్ మినిస్టర్ హోదాను కట్టబెట్టింది. దీంతో ఈ టెర్రరిస్టు భార్య.. పాక్ లో మానవ హక్కులు, మహిళా సాధికారత తదితర అంశాల్లో ప్రధానికి సలహాలు ఇవ్వనున్నారు. కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ ను ఈ పదవి వరించింది.

కాగా, టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మాలిక్ కు కోర్టు జీవిత ఖైదు విధించగా.. ఎన్ఐఏ మాత్రం మరణశిక్ష విధించాలని వాదిస్తోంది. ఈ కేసులో ఈ నెల 9న వీడియో లింక్ ద్వారా యాసిన్ మాలిక్ కోర్టు విచారణకు హాజరయ్యాడు. టెర్రరిస్టు యాసిన్ మాలిక్ తో ముషాల్ హుస్సేన్ ముల్లిక్ వివాహం 2009లో జరిగింది.

పాకిస్థాన్ లో ప్రస్తుతం అన్వర్ ఉల్ హక్ కాకర్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ ఇటీవల పార్లమెంట్ ను రద్దు చేసి ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. నిర్ణీత గడువు (90 రోజుల) లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆపద్ధర్మ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఈ గడువులోగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని పాకిస్థాన్ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రాసెస్ కొనసాగుతుండడంతో ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ అధికారులు భావిస్తున్నారు.
Pakistan
Jammu And Kashmir
terrorist
yasin malik wife
pak pm
special adviser

More Telugu News