Telangana: దివంగత నాయినికి తెలంగాణ ప్రభుత్వం గౌరవం.. నూతన స్టీల్‌ బ్రిడ్జికి ‘నాయిని’ పేరు

  •  ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి
  • రూ. 450 కోట్లతో 2.63 కి.మీ పొడవుతో ప్రారంభానికి సిద్ధం
  • రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Indirapark to VST Steel Bridge is named after Naini narasimhareddy

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, దివంగత నాయిని నర్సింహా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంది. హైదరాబాద్‌ లో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలను జారీ చేయనుంది. సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. 

ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా, సుమారు రూ.450 కోట్లతో నిర్మించిన పొడవైన ఈ స్టీల్‌ బ్రిడ్జిని శనివారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసి స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (ఎస్ఆర్ డీపీ) భాగంగా 2.63 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది.

More Telugu News