Hyderabad: హైదరాబాద్ లో కుప్పలుగా అపార్ట్ మెంట్లు.. తొలి త్రైమాసికంలో అమ్ముడుపోని 99 వేల ఫ్లాట్లు

Demand decreased for apartment flats in Hyderabad over 99k unsold flats in the first quarter

  • అపార్ట్‌ మెంట్లలో మిగిలిపోయిన ఫ్లాట్ల సంఖ్యలో  దేశంలోనే రెండో స్థానం
  • భారీ ధరలు, ఐటీ ఉద్యోగుల కోత, ఈఎంఐలు ఎక్కువగా ఉండటమే కారణం
  • ప్రముఖ వెబ్‌సైట్‌ ప్రాప్‌ ఈక్విటీ సంస్థ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గత కొన్నేళ్లుగా జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నగరంలో ఎకరం ధర అత్యధికంగా వంద కోట్ల రూపాయలు పలికి రికార్డు బద్దలు కొట్టింది. మరోవైపు నరగంలో సొంతిల్లు సామాన్యుడికి కలలా మారింది. ఇళ్లు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. నగరం నలుమూలలా భారీ వెంచర్లు ఏర్పాటై విల్లాలు, అపార్ట్ మెంట్లు నిర్మితం అవుతున్నాయి. కానీ, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లకు గిరాకీ భారీగా తగ్గింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 5.26 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోలేదు. అందులో హైదరాబాద్‌ వాటా 99,989 ప్లాట్లుగా ఉండటం గమనార్హం. ఇలా కట్టి సిద్ధంగా ఉన్న అపార్ట్‌ మెంట్లలో అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్ల సంఖ్యలో హైదరాబాద్‌ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది.

 మహారాష్ట్రలోని థానే 1,07,179 అమ్ముడుకాని ఫ్లాట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ విక్రయాలను అధ్యయనం చేసే ప్రముఖ వెబ్‌సైట్‌ ప్రాప్‌ ఈక్విటీ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం గత త్రైమాసికంతో పోలిస్తే హైదరాబాద్‌లో అమ్ముడుకాని ఫ్లాట్లు 5 శాతం మేర పెరిగాయి. నగరంలో నానాటికి పెరుగుతున్న ఫ్లాట్ల ధరల కారణంగా మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలకు దూరం అవుతున్నట్టు వెబ్‌సైట్‌ విశ్లేషించింది. ఐటీలో ఉద్యోగుల కోత, ఉద్యోగ అభద్రత ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగటంతో వారు కొనుగోళ్లకు ఆసక్తి చూపట్లేదని వెల్లడించింది. ధరలు పెరగటం, ఈఎంఐలు ఎక్కువగా ఉండటంతో ఐటీ ఉద్యోగులూ ఫ్లాట్ల కొనుగోలుకు విముఖత చూపిస్తున్నారని వెబ్‌సైట్‌ విశ్లేషించింది.

Hyderabad
apartment
flats
unsold flats
  • Loading...

More Telugu News