Haryana: భార్య చీర దొంగిలించాడని పొరుగింటి యువకుడి హత్య

  • హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలోగల నాథ్‌పూర్ గ్రామంలో ఘటన
  • పొరుగింటి యువకుడు తన చీర దొంగిలించాడంటూ భర్తకు మహిళ ఫిర్యాదు 
  • ఈ విషయమై యువకుడిని ప్రశ్నించిన మహిళ భర్త, ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం
  • మహిళ భర్త విచక్షణ కోల్పోయి యువకుడిని తుపాకీతో పొట్టలో కాల్చిన వైనం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి, హత్య చేసినట్టు నిందితుడి అంగీకారం
Gurugram man shoots neighbour dead for stealing wifes saree arrested

హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య చీర దొంగిలించాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పొరుగింటి యువకుడిని తుపాకీతో కాల్చి చంపాడు. జిల్లాలోని నాథ్‌పూర్‌ గ్రామంలో అజయ్ సింగ్, అతడి భార్య రీనా ఓ అద్దెంట్లో నివసిస్తున్నారు. అదే భవంతిలోని మరో ఇంట్లో పింటూ (30) అనే సెక్యూరిటీ గార్డు ఉంటున్నాడు. 

కాగా, పింటూ తన చీరను దొంగిలించాడంటూ రీనా మంగళవారం తన భర్తకు ఫిర్యాదు చేసింది. ఆ రాత్రి 8.00 గంటలకు పింటూ ఇంటికొచ్చాక అజయ్ సింగ్ ఈ విషయమై నిలదీశాడు. కానీ, పింటూ అతడి ఆరోపణలను ఖండించాడు. ఇది ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అజయ్ సింగ్ తన ఇంట్లో నుంచి పెద్ద డబుల్ బ్యారెల్ గన్ను తెచ్చి పింటూను కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే, పింటూతో పాటూ ఉంటున్న అతడి స్నేహితులు అజయ్ సింగ్‌ నుంచి తుపాకీ లాగేసుకున్నారు. కానీ, అజయ్ మళ్లీ వాళ్ల వద్ద ఉన్న తుపాకీని బలవంతంగా తీసుకుని పింటూని కడుపులో కాల్చాడు. 

రక్తపుమడుగులో కుప్పకూలిపోయిన పింటూను వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో, పోలీసులు అజయ్‌ సింగ్‌పై హత్య, ఆయుధ చట్టం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పింటూ బీహార్‌ వాసి కాగా అజయ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి గన్ను, లైసెన్స్‌తో పాటూ ఘటనా స్థలంలో లభించిన బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హత్యానేరాన్ని అంగీకరించినట్టు గురువారం ఏసీపీ మీడియాకు వెల్లడించారు.

More Telugu News