PMJAY: 'ఆయుష్మాన్ భారత్‌'లో మృతులకు చికిత్సపై స్పందించిన కేంద్రం

  • గతంలోనే చనిపోయిన 3,446 మందికి చికిత్స అందించినట్టు వార్తలు
  • జన్ ఆరోగ్య యోజనలో రూ. 7 కోట్ల అక్రమాలు జరిగాయంటూ కాగ్ నివేదిక
  • ఆ వార్తల్లో నిజం లేదన్న కేంద్రం
  • మీడియా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం
Media Reports On CAG Report On PMJAY Are Fake Says Central Govt

ఆయుష్మాన్ భారత్‌లో అక్రమాలు జరిగాయని, చనిపోయిన వారికి చికిత్స చేసి దాదాపు రూ. 7 కోట్లు నొక్కేశారంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పందించింది. మీడియా కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆయుష్మాన్ భారత్ పీఏం-జేఏవై (జన్ ఆరోగ్య యోజన) లబ్ధిదారులను నిర్ణయించడంలో మొబైల్ నంబర్లకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వీటిని ఖండిస్తున్నట్టు తెలిపింది.

జన్ ఆరోగ్య యోజన పథకం కింద గతంలో చనిపోయిన 3,446 మంది రోగులకు చికిత్స అందించినట్టు పేర్కొంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల ఓ నివేదికను విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆసుపత్రులు సమర్పించిన క్లెయిములను పరిశీలిస్తే గతంలో చనిపోయిన 3,446 మంది రోగులకు కూడా చికిత్స అందించినట్టు తేలిందని ఆ నివేదికలో కాగ్ పేర్కొంది.

ఇలాంటి క్లెయిములు కేరళలో అత్యధికంగా ఉండగా, ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. కాగా, ఆయుష్మాన్ అమలు తీరుపై ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో కాగ్ నివేదికను పార్లమెంటు ముందు ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. కాగ్ ప్రతిపాదనలను పరిశీలించి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

More Telugu News