USA: 27 ఏళ్ల పాటు ఒక్క రోజు కూడా సెలవు పెట్టని ఉద్యోగికి ప్రజల గిఫ్ట్‌ రూ.3.5 కోట్లు!

Burger King employee who went viral for not missing work for 27 years gets Rs three and half crore via crowdfunding
  • అమెరికాలోని లాస్ వేగాస్‌లో గల మెక్‌కేరెన్ ఎయిర్‌పోర్టులో వెలుగు చూసిన ఘటన
  • ఎయిర్‌పోర్టులోని బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగి
  • గతేడాది 27 ఏళ్ల మైలురాయి చేరుకున్న సమయంలో గుర్తింపుగా దక్కిన రెండు చాక్లెట్లు
  • పెద్దాయనకు తగిన గుర్తింపు దక్కలేదంటూ నెటిజన్ల విచారం
  • ఉద్యోగి కూతురు ప్రారంభించిన గోఫండ్‌మీ పేజ్‌కు ఏకంగా రూ.3.5 కోట్ల విరాళం
ఆయనది సుమారు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలోనూ ఆయన ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. గతేడాదే ఈ మైలు రాయిని చేరుకున్న ఆయనకు కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు రెండు చాక్లెట్లు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా బాట పట్టడంతో అనేక మంది ఆయన పరిస్థితికి చలించిపోయారు. ఇక తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచీ కళ్లారా చూసిన కూతురు మాత్రం ఆయన కష్టాన్ని ప్రజల ముందుంచింది. ఫలితంగా ఆ పెద్దాయనకు ఏకంగా రూ.3.5 కోట్లు అందాయి. అమెరికాలోని బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఓ పెద్దాయన ఉదంతం ఇది. 

కెవిన్ ఫోర్డ్ గత 27 ఏళ్లుగా లాస్ వేగాస్‌లోని మెక్‌కేరెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. గతేడాదే ఆయన ఈమైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా కెవిన్‌కు ఉద్యోగులు కేవలం రెండు చాక్లెట్లు, ఓ కాఫీ కప్పు బహుమతిగా ఇచ్చిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లతో పాటూ కెవిన్ కూతురిని కూడా ఇది బాధించింది. కెవిన్‌ కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. తమ కోసం ఇంతగా కష్టపడ్డ తండ్రికి తగిన గుర్తింపు దక్కేలా చూసేందుకు ఆయన కూతురు స్వయంగా రంగంలోకి దిగింది. ఆయన పేరిట విరాళాల సేకరణకు గోఫండ్‌మీ పేజ్‌ను ప్రారంభించింది. 

‘‘అమ్మ నుంచి విడిపోయాక నాన్నకు కోర్టు నన్నూ, మా అక్కను అప్పగించింది. అప్పటి నుంచీ మమ్మల్ని ఏ కష్టం రాకుండా పెంచేందుకు ఆయన ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆయన మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, బర్గర్ కింగ్‌ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ లభించడంతో ఆయన అక్కడే కొనసాగారు. ఫలితంగా మేమందరం కాలేజీ చదువులు కూడా పూర్తి చేయగలిగాం. మా నాన్న ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు. త్వరలో ఆయన రిటైర్ కానున్నారు. ఇప్పుడు ఆయన జాబ్ మానేస్తే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోల్పోతారు. మేము ఎవరి నుంచీ డబ్బు ఆశించట్లేదు కానీ ఇప్పటికైనా ఆయన కష్టానికి గుర్తింపు దక్కితే అప్పుడప్పుడైనా ఆయన తన మనవలు మనవరాళ్లను చూసేందుకు వీలు చిక్కుతుంది’’ అని ఆమె గోఫండ్‌మీ పేజ్‌లో రాసుకొచ్చింది.

ఈ పోస్టుకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. భవిష్యత్తులో పెద్దాయనకు డబ్బు అవసరాల గురించి బెంగలేకుండా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో మొత్తం రూ.3.5 కోట్లు( మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) ఆయనకు దక్కాయి. దీంతో, కెవిన్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. ‘‘ఇది నిజంగా అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నాపై చూపిన కరుణతో జీవితం ఒక్కసారిగా మారిపోయింది. రిటైర్మెంట్ తరువాత సుఖంగా జీవించేందుకు సరిపడా డబ్బు అందింది. పిల్లలను సెటిల్ చేసేందుకూ ఈ మొత్తం సరిపోతోంది’’ అంటూ కెవిన్ సంబరపడిపోతూ మీడియాతో వ్యాఖ్యానించాడు.
USA
Crowdfunding
Burger king employee
Lasvegas

More Telugu News