Imran Khan: అక్రమ్ ఆగ్రహం.. తప్పు సరిదిద్దుకున్న పాక్ క్రికెట్ బోర్డు.. వీడియోలో ఇమ్రాన్ ఖాన్ లేకపోవడంపై పీసీబీ వివరణ!

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీడియో విడుదల చేసిన పీసీబీ
  • ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ ను వీడియోలో చూపించని పాక్ బోర్డు
  • పీసీబీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల ఆగ్రహం
  • ఇమ్రాన్ కు క్షమాపణ చెప్పాలన్న వసీమ్ అక్రమ్
  • వీడియోను డిలీట్ చేయాలన్న పీసీబీ మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్
PCB adds Imran Khan in its video

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అవమానించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీసీబీ విడుదల చేసిన వీడియో వివాదాస్పదమయింది. పాకిస్థాన్ ఘనమైన క్రికెట్ చరిత్రను వివరించేలా ఉన్న ఆ వీడియోలో... ఆ దేశానికి ప్రపంచకప్ ను అందించిన ఇమ్రాన్ ఖాన్ ను ఒక్కసారి కూడా చూపించలేదు. దీంతో, పీసీబీపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. రాజకీయాలు వేరు, క్రికెట్ వేరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్గజాలను విస్మరించేలా ఇలాంటి వీడియోలను చేయడం మంచిది కాదని దుయ్యబట్టారు. 

పాకిస్థాన్ మరో క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కూడా పీసీబీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విమానాలు మారుతూ, ఎన్నో గంటల ప్రయాణం తర్వాత శ్రీలంకకు చేరుకున్న తాను... పీసీబీ క్లిప్ ను చూసి షాకయ్యానని చెప్పారు. ఆల్ టైమ్ గ్రేట్ ఇమ్రాన్ ఖాన్ లేకుండా పాకిస్థాన్ క్రికెట్ చరిత్రను ఎలా చెపుతారని మండిపడ్డారు. ప్రపంచ క్రికెట్ కే ఇమ్రాన్ ఒక ఐకాన్ అని, పాకిస్థాన్ క్రికెట్ ను తన కెప్టెన్సీలో ఇమ్రాన్ ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని, అలాంటి ఉన్నతమైన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు. రాజకీయాలను పక్కన పెట్టాలని... ఈ వీడియోను డిలీట్ చేసి, ఇమ్రాన్ కు క్షమాపణ చెప్పాలని పీసీబీని డిమాండ్ చేశారు. మరోవైపు పీసీబీ మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్ కూడా వీడియోను వెంటనే తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల క్రమంలో పీసీబీ దిగొచ్చింది. పాత వీడియోను తొలగించి, కొత్త వీడియోను షేర్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను వీడియోలో చేర్చింది. ప్రపంచకప్ ను ఇమ్రాన్ సగర్వంగా పట్టుకున్న పిక్ ను వీడియోలో ఉంచింది. మరోవైపు అదేదో పొరపాటున జరిగిపోయినట్టు వివరణ ఇచ్చింది. '2023 ప్రపంచకప్ కు సంబంధించి పీసీబీ ప్రమోషనల్ క్యాంపెయిన్ ను చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియోలలో ఒకదాన్ని ఆగస్ట్ 14న విడుదల చేశాం. అయితే ఆ వీడియో నిడివి ఎక్కువ కావడంతో, లెంగ్త్ ను కుదించాం. దీంతో ఆ వీడియోలో ఇంపార్టెంట్ క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో ఆ పొరపాటును సరిదిద్దాం' అని చెప్పుకొచ్చింది. 

More Telugu News