Tirumala: భక్తులకు కర్రల పంపిణీపై ట్రోల్స్‌.. స్పందించిన టీటీడీ చైర్మన్ భూమన!

  • అటవీ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామన్న భూమన
  • కర్రలు ఇచ్చి, బాధ్యతల నుంచి తప్పుకున్నామనడం సమంజసం కాదని వ్యాఖ్య
  • భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
  • ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని ప్రకటన
ttd chairman responded to trolls on social media

తిరుమల అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రలు పంపిణీ చేయాలన్న టీటీడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ భూమన కరుణాకర్‌‌రెడ్డి స్పందించారు. ట్రోల్స్‌ను ఖండించిన ఆయన.. అటవీ శాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. 

తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి భూమన పరిశీలించారు. కర్రలు ఇచ్చి, బాధ్యతల నుంచి టీటీడీ తప్పుకుంటున్నదని ట్రోల్స్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బోనులో చిక్కిన మగ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని తెలిపారు. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

More Telugu News