Heavy Rains: వరదలతో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అతలాకుతలం.. 81కి చేరిన మృతుల సంఖ్య

  • శిథిలాల కింద బయటపడుతున్న మృతదేహాలు
  • ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే 71 మంది మృత్యువాత
  • ఉత్తరాఖండ్, పంజాబ్‌లోనూ దారుణ పరిస్థితులు
  • భారీ వర్షాలు ఇంకా ఉన్నాయన్న వాతావరణశాఖ
81 dead in rain fury in Himachal and Uttarakhand

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కూలిన ఇళ్ల శిథిలాల నుంచి మృతదేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 81 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క హిమాచల్‌లోనే 71 మంది మరణించారు. మరో 13 మంది గల్లంతయ్యారు. 

 మరికొన్ని రోజులపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు సిమ్లా సహా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 24 నుంచి  ఇప్పటి వరకు 214 మంది మరణించారు. 38 మంది జాడ ఇప్పటికీ తెలియరాలేదు. సమ్మర్ హిల్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వందలాదిమందిని రక్షించారు. జులైలో రాష్ట్రంలో కురిసిన వర్షపాతం 50 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 

ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. లక్ష్మణ్ ఝులాలో ఓ రిసార్టుపై కొండచరియలు విరిగిపడడంతో నలుగురు మృతి చెందారు. శిథిలాల నుంచి దంపతులు, వారి కుమారుడిని ఇప్పటి వరకు వెలికితీశారు.  వీరితో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది. పంజాబ్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ వేధిస్తున్నాయి. పోంగ్, భాక్రా డ్యాములు నిండిపోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హోషియాపూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

More Telugu News