Vistara Airlines: ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా ఎయిర్ లైన్స్‌లో ఘటన

  • ఆగస్టు 11న న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళుతున్న విమానంలో ఘటన
  • బాలిక అల్లరి కారణంగా వేడివేడి చాక్లెట్ ఆమె ఒంటిపై పడిందన్న ఎయిర్‌లైన్స్
  • ఎయిర్‌లైన్స్ ప్రామాణిక పద్ధతుల ప్రకారం బాలికకు ప్రాథమిక చికిత్స అందించామన్న సంస్థ
  • విమానం ల్యాండవగానే అంబులెన్స్ ఏర్పాటు చేసి చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడి
  • ఆసుపత్రి ఖర్చులను బాధిత కుటుంబానికి తిరిగి చెల్లిస్తామని స్పష్టీకరణ
Girl suffers burns as hot beverage spills on her on Vistara flight

గతవారం తమ విమానంలో ప్రయాణిస్తున్న ఓ పదేళ్ల బాలిక ఒంటిపై హాట్ చాక్లెట్ పడి గాయాలయ్యాయని విస్తారా ఎయిర్‌లైన్స్ బుధవారం ప్రకటించింది. బాలిక చికిత్సకు సంబంధించిన ఖర్చంతా తామే తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఆగస్టు 11న ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు (జర్మనీ) బయలుదేరిన యూకే25 విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. 

‘‘బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు మా సిబ్బంది చిన్నారికి హాట్ చాక్లెట్ సర్వ్ చేశారు. ఆ సమయంలో చిన్నారి అల్లరి చేస్తుండడం వల్ల వేడివేడి హాట్ చాక్లెట్ బాలిక ఒంటిపై ప్రమాదవశాత్తూ ఒలికింది. ఎయిర్‌లైన్స్ ప్రామాణిక పద్ధతులను అనుసరించి మా సిబ్బంది బాలిక గాయానికి ప్రాథమిక చికిత్స చేశారు. ఈ క్రమంలో, విమానంలోని పారామెడికల్ సిబ్బంది సాయం కూడా తీసుకున్నారు’’ అని విస్తారా ఓ ప్రకటనలో తెలిపింది. విమానం ల్యాండవగానే బాలిక కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించింది. 

అయితే, ఎయిర్‌హోస్టస్ తప్పిదం కారణంగా బాలికకు సెకెండ్ డిగ్రీ గాయమైనట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనలో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని రచనా గుప్తా అనే మహిళ సోషల్ మీడియాలో ఆరోపించింది. అయితే, ఘటన తరువాత బాధిత కస్టమర్‌తో తమ సిబ్బంది టచ్‌లోనే ఉన్నారని ‘విస్తారా’ తన ప్రకటనలో పేర్కొంది.

More Telugu News