TDP: ధర్మవరంలో టీడీపీ నేత ఇంటిపై రాళ్లదాడి.. మంగళవారం అర్ధరాత్రి ఘటన

  • సోషల్ మీడియాలో పోస్ట్ పై వివాదం
  • పోలీసులమంటూ వచ్చి దాడికి పాల్పడ్డారని టీడీపీ లీడర్ ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కత్తుల బాబ్జీ, ఆయన భార్య సునీత
TDP leader attacked by ycp leaders in Dharmavaram

ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరంలో మంగళవారం అర్ధరాత్రి టీడీపీ లీడర్ కత్తుల బాబ్జీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడని వైసీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు బాబ్జీ ఇంటిపైకి వెళ్ళారు. పోలీసులమని దబాయిస్తూ, స్టేషన్ కు రావాలని బెదిరిస్తూ దాడికి పాల్పదినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో కత్తుల బాబ్జీ, ఆయన భార్య సునీత గాయపడ్డారు. బుధవారం ఉదయం భార్యాభర్తలు ఇద్దరూ పోలిస్ స్టేషన్ కు వెళ్లి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు.

బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాజీ మంత్రి పరిటాల రవీంద్రపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. దీనిని ఖండిస్తూ ధర్మవరంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు పరిటాల రవీంద్ర కృషి చేశారని బాబ్జీ మరో పోస్టు పెట్టారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం రాత్రి కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు బాబ్జీ ఇంటికి వచ్చారు. తాము పోలీసులమని చెబుతూ సోషల్ మీడియాలో బాబ్జీ పెట్టిన పోస్టుపై ప్రశ్నించారు. 

స్టేషన్ కు రావాలని బెదిరించారు. అయితే, వచ్చింది పోలీసులు కాదని గుర్తించిన బాబ్జీ.. తాను ఎక్కడికీ వచ్చేదిలేదని తేల్చిచెప్పాడు. దీంతో వైసీపీ నేతలు దాడికి దిగారు. రాళ్లు విసరడంతో బాబ్జీ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అప్పటికే బాబ్జీతో పాటు ఆయన భార్య సునీతకు గాయాలయ్యాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామి రెడ్డి అనుచరులు అమర్ రెడ్డి, జరీ ప్రసాద్, శ్రీనివాసులతో పాటు మరో ఐదుగురు ఈ దాడికి పాల్పడ్డారని బాబ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

More Telugu News