Atrocity: ప్రకాశం జిల్లాలో దారుణం.. దళిత మహిళ కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి సజీవ దహనానికి యత్నం

  • ప్రేమ వివాహం చేసుకున్న బాధిత మహిళ సోదరుడు
  • పరువు తక్కువగా భావించి యువకుడిపై దాడి చేసిన యువతి తల్లిదండ్రులు
  • ఆ కేసులో అరెస్టై బెయిలుపై బయటకొచ్చిన వైనం
  • సోమవారం అర్ధరాత్రి యువకుడి సోదరిపై దారుణంగా దాడి
  • పోలీసులు సకాలంలో స్పందించడంతో తప్పిన ముప్పు 
Dalit Woman Attacked In Prakasam District

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఓ దళిత వితంతు మహిళపై సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అకృత్యానికి పాల్పడ్డారు. కళ్లలో కారం కొట్టి వివస్త్రను చేసి సజీవ దహనానికి యత్నించారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళకు రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమె నర్సు శిక్షణ తీసుకుని ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆమె సోదరుడు, బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు. మార్చిలో గ్రామం నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడంతో యువతి కుటుంబ సభ్యులకు తలకొట్టేసినట్టుగా అయింది. 

దీంతో యువకుడి ఇంటిపై యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ కలిసి దాడిచేశారు. యువకుడి తల్లిని, సోదరిని కులం పేరుతో దూషించి తీవ్రంగా గాయపరిచారు. తమ కుమార్తెను అప్పగించకుంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత బెయిలుపై విడుదలైన నిందితులు మరోమారు దాడికి యత్నించారు.

బాధితురాలు సోమవారం తన తల్లిని చూసేందుకు పుట్టింటికి వచ్చింది. అర్ధరాత్రి వేళ కుళాయి నీరు రావడంతో పట్టుకునేందుకు వీధిలోకి రాగా నిందితులు బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను పట్టుకుని కళ్లలో కారం కొట్టి కత్తులతో విచక్షణ రహితంగా దాడిచేశారు. వీధులోకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేశారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి మరోమారు దాడిచేశారు. ఆపై పెట్రోలు చల్లి నిప్పు అంటించే ప్రయత్నం చేశారు.

ఈ వికృత చర్యను చూసిన గ్రామస్థులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో వారు సకాలంలో స్పందించారు. అర్ధరాత్రి దాటాక 1.20 గంటలకు గ్రామానికి చేరుకుని బ్రహ్మారెడ్డి ఇంట్లో బందీగా ఉన్న బాధితురాలిని విడిపించారు. కట్లు విప్పి ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News