Bill Gates: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫొటోను ప్రదర్శించిన బిల్ గేట్స్..! ఇంటర్వ్యూలో ఆసక్తికర సన్నివేశం

  • కొత్త పాడ్‌క్యాస్ట్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
  • కార్యక్రమంలో ఆన్‌లైన్ విద్యావేదిక ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌ను ఇంటర్వ్యూ 
  • సాల్ ఖాన్‌ను బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ అనుకుని ఎవరైనా పొరబడ్డారా అని సాల్ ఖాన్‌కు ప్రశ్న
  • నటుడి అభిమానులు కొందరు మొదట్లో ఇలా పొరబడే వాళ్లని చెప్పిన సాల్ ఖాన్
  • సల్మాన్ ఖాన్‌కు గణితం వచ్చని తమకు ఇంతవరకూ తెలీదని కొందరు వ్యాఖ్యానించారని వెల్లడి
Bill Gates asks Khan Academy Founder Sal Khan whether people mistake him for bollywood actor salman khan

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ప్రారంభించిన తన పాడ్ కాస్ట్ ‘అన్‌కన్‌ఫ్యూజ్ విత్ బిల్ గేట్స్‌’ షోలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఉచిత ఆన్‌లైన్ శిక్షణా సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేస్తూ బిల్ గేట్స్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫొటోను ప్రదర్శించారు. ‘‘మీరు సల్మాన్ ఖాన్ అని ఎవరైనా పొరబడ్డారా?’’ అని సాల్ ఖాన్‌ను గేట్స్ ప్రశ్నించారు. ‘‘గూగుల్‌లో సాల్ ఖాన్ అని టైప్ చేస్తే బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్‌ తాలూకు పేజీలు కూడా కనిపిస్తాయి. మరి మీరు సల్మాన్ ఖాన్ అని ఎవరైనా పొరపాటున అనుకున్నారా? అని ప్రశ్నించారు. మొదట్లో అలాగే జరిగేదని సాల్ ఖాన్ చెప్పుకొచ్చారు. 

ఖాన్ అకాడమీ ప్రారంభమైన తొలి రోజుల్లో సల్మాన్ ఖాన్ అభిమానులు అనేక మంది తనకు ఈమెయిల్స్ పంపించేవారని గుర్తు చేసుకున్నారు. ‘‘మీరంటే మాకు చాలా అభిమానమని అనేకమంది చెప్పేవారు. మీకు గణితం కూడా వచ్చని మాకు ఇంతవరకూ తెలీదు’’ అని మెయిల్ చేసేవారని చెప్పారు. దీంతో, బిల్ గేట్స్ పెద్దపెట్టున నవ్వారు. 

బంగ్లాదేశ్‌కు చెందిన సల్మాన్ ఖాన్.. నెటిజన్లకు సాల్ ఖాన్‌గా సుపరిచితులు. అమెరికాలో ఉండే ఆయన ఆన్‌లైన్‌లో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా పాఠాలను బోధించేందుకు ఖాన్ అకాడమీ ప్రారంభించారు. ఒక్కో అంశాన్నీ నెమ్మదిగా విడమరిచి చెప్పే ఆయన బోధనా శైలి విద్యార్థులకు అమితంగా నచ్చడంతో ఖాన్ అకాడమీ చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యింది. తన మనవలకు పాఠాలు బోధించేందుకు తానూ ఖాన్ అకాడమీ సాయం తీసుకుంటానని బిల్ గేట్స్ ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత, గేట్స్ స్వయంగా ఖాన్ అకాడమీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి సాల్ ఖాన్‌ను మరింతగా ప్రోత్సహించారు.

More Telugu News