Raghu Rama Krishna Raju: జగన్ ను దేవుడితో పోల్చడం ఏమిటి?: వైసీపీ మంత్రులపై రఘురాజు ఫైర్

  • రుషికొండకు గుండు కొట్టించి ఇల్లు కట్టుకున్న వ్యక్తిని దేవుడితో పోలుస్తారా అన్న రఘురాజు 
  • జగన్ కట్టుకున్న అక్రమ భవనం సీఆర్ జెడ్ జోన్ లోకి వస్తుందని ఆరోపణ
  • ఈ భవనాలను కొత్త ప్రభుత్వం కూల్చేయాలని వ్యాఖ్య
raghu raju fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ మంత్రులపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. విశాఖలోని రుషికొండకు గుండు కొట్టించి, అక్రమంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తిని మంత్రులు దేవుడితో పోల్చడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టూరిజం కాటేజీల ముసుగులో జగన్ కట్టుకుంటున్న అక్రమ భవనం సీఆర్ జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని... ఈ జోన్ లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన కూడా మంత్రులకు లేదని ఎద్దేవా చేశారు. రుషికొండపై జగన్ భవనాన్ని తిరుమల కొండపై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం కొండపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంతో పోల్చారని మండిపడ్డారు. మంత్రులకు మతి పోయినట్టు ఉందని అన్నారు.  
 
కొండపై కట్టిన నాలుగు బ్లాకులకు 4 పేర్లు పెట్టారని రఘురాజు తెలిపారు. వీటిలో సీఎం నివాస సముదాయం, క్యాంపు కార్యాలయం, కార్యదర్శుల కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని అన్నారు. టూరిజం కాటేజీల ముసుగులో నిర్మించుకున్న ఈ అక్రమ భవానాలను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కూల్చి వేయాలని చెప్పారు. ఈ భవనాల నిర్మాణాలకు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

More Telugu News