CJI Chandrachud: సుప్రీంకోర్టుపై ప్రధాని ప్రశంసలు.. రెండు చేతులతో నమస్కరించిన చీఫ్ జస్టిస్

CJI Chandrachuds folded hand gesture as PM Modi lauds Supreme Court for this move
  • తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించనున్న సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టు నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని
  • స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయం
  • రెండు చేతులతో ప్రతి నమస్కారం చేసిన చీఫ్ జస్టిస్
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ రెండు చేతులతో నమస్కరించిన అరుదైన దృశ్యం స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా చోటు చేసుకుంది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. స్థానిక భాషల్లోనే తీర్పులను ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాతృభాషల ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు.

‘‘సుప్రీంకోర్టుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీర్పులోని ముఖ్య భాగం అంతా కూడా మాతృభాషలోనే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. మాతృభాషల ప్రాధాన్యాన్ని సుప్రీంకోర్టు పెంచుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన అతిథుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ప్రధాని సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పడంతో.. జస్టిస్ చంద్రచూడ్ సైతం రెండు చేతులను పైకి ఎత్తి ప్రతి నమస్కారం చేశారు. అక్కడున్న వారంతా ప్రధాని ప్రసంగానికి చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

కోర్టులు స్థానిక భాషల్లోనే తీర్పులు జారీ చేయాలంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ చెబుతుంటారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఒక దానిని హిందీ, తమిళం, గుజరాతీ, ఒడియా భాషల్లోకి అనువదించారు. తీర్పులను అనువాదం చేయడం వల్ల ప్రజలు వాటిని అర్థం చేసుకోగలరన్నది చీఫ్ జస్టిస్ అభిప్రాయంగా ఉంది. న్యాయ పరమైన పదాలతో కూడిన ఇంగ్లిష్ భాషను 99.9 శాతం ప్రజలు అర్థం చేసుకోలేరని ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొనడం గమనార్హం. అందుకే తీర్పులను ప్రాంతీయ భాషల్లో అనువదించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 
CJI Chandrachud
olded hand
gesture
PM Modi
Supreme Court

More Telugu News