3 evils: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ

  • వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ప్రకటన
  • ఇందుకోసం అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులను తరిమి కొట్టాలని పిలుపు
  • మధ్యతరగతి ప్రజల సామర్థ్యాలు పెరిగినట్టు వెల్లడి
Have to fight 3 evils of corruption nepotism appeasement

ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం చేసిన సుదీర్ఘ ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు అనే మూడు శత్రువులను భారత్ ఎదుర్కొంటోందంటూ.. వాటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన వందేళ్లకు సరిగ్గా 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రకటించారు. 

‘‘మన దేశం శత స్వాతంత్య్ర దినం జరుపుకునే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. నా దేశ శక్తి సామర్థ్యాలు, వనరుల లభ్యత ఆధారంగా నేను ఈ మాట చెబుతున్నాను. కాకపోతే ఇందుకోసం మనం మూడు శత్రువులు.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులపై పోరాడాలి’’ అని ప్రధాని ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనిపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాలకు చోటు ఉండకూదన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకున్నారు. ‘‘నేడు పరివర్వాద్ (కుటుంబ రాజకీయాలు), బుజ్జగింపులు మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీకి కేవలం ఒక కుటుంబమే ఇన్ చార్జ్ గా ఎలా ఉంటుంది? వారి జీవిత మంత్రం ఒక్కటే.. పార్టీ అంటే కుటుంబం. కుటుంబం కోసం, కుటుంబం కొరకు’’ అంటూ విమర్శలు కురిపించారు. 

‘‘మేము 2014లో అధికారంలోకి వచ్చే నాటికి భారత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉంది. 140 కోట్ల భారతీయుల కృషితో 5వ స్థానానికి చేరుకున్నాం. లీకేజీలకు చెక్ పెట్టి, ఆర్థిక వ్యవస్థను బలంగా మార్చాం. వచ్చే ఐదేళ్లలో మూడో స్థానానికి చేరుకోవడం ఖాయం’’ అని ప్రధాని చెప్పారు. పేదరికం తగ్గడంతో మధ్యతరగతి సామర్థ్యాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయన్నారు. గడిచిన  ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు.

More Telugu News