Mallikarjun Kharge: స్వాతంత్ర్య వేడుకలకు హాజరుకాని ఖర్గే.. కారణం చెప్పిన కాంగ్రెస్

  • ఆరోగ్యం సహకరించని కారణంగానే హాజరు కాలేదన్న కాంగ్రెస్ పార్టీ
  • వీడియో సందేశం పంపిన ఖర్గే
  • మాజీ ప్రధానుల సేవలను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ చీఫ్
  • బీజేపీపై పరోక్ష విమర్శలు
Congress Chief Kharge Slams BJP On Independence Day

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన కుర్చీ ఖాళీగా కనిపించింది. వేడుకల్లో  ఖర్గే పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. ఆరోగ్యం సహకరించని కారణంగానే ఖర్గే రాలేకపోయారని తెలిపింది. 

మరోవైపు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖర్గే ఓ వీడియో సందేశం పంపారు. దేశ ప్రగతి కోసం మాజీ ప్రధానులు చేసిన సేవలను కొనియాడారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి, రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌తోపాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును కూడా ప్రస్తావించారు. దేశాభివృద్ధికి ప్రతి ప్రధాని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారన్న ఆయన.. కానీ కొంతమంది మాత్రం కొన్నేళ్ల నుంచే దేశం ప్రగతి పథంలో వెళ్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని, బీజేపీని ఉద్దేశించి విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు నేడు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకు కొత్త సాధనాలు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా బలహీన పరుస్తున్నారని ఖర్గే విమర్శించారు.

More Telugu News