Typhoon Lan: జపాన్ ను వణికిస్తున్న టైఫూన్ 'లాన్'

  • పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న టైఫూన్ల సీజన్
  • ఈ సీజన్ లో ఏడో టైఫూన్ దూసుకువస్తున్న వైనం
  • ఈ టైఫూన్ కు లాన్ అని నామకరణం
  • మధ్య జపాన్ వైపు గురిపెట్టిన లాన్
  • గంటకు 195 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు,
  • భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న జేఎంఏ
Powerful Typhoon Lan barrels towards Central Japan

పసిఫిక్ మహాసముద్రంలో ఇది టైఫూన్ల సీజన్. ప్రచండ గాలులు, కుంభవృష్టిని వెంటేసుకుని వచ్చే ఈ టైఫూన్లు తాము పయనించే మార్గంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. తాజాగా ఈ సీజన్ లో ఏడో టైఫూన్ దూసుకువస్తోంది. ఈ టైఫూన్ పేరు లాన్... ఇది జపాన్ కు గురిపెట్టింది. 

ఇది మధ్య జపాన్ భూభాగంపైకి ప్రవేశించే అవకాశాలున్నాయని, గంటకు 195 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని, జపాన్ పై మంగళవారం నుంచి దీని ప్రభావం ఉంటుందని జేఎంఏ తెలిపింది.

ప్రధానంగా ఒసాకా, క్యోటో నగరాల మీదుగా ఈ టైఫూన్ పయనించే అవకాశాలున్నట్టు తెలిపింది. భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. 

శక్తిమంతమైన టైఫూన్ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. తుపాను ప్రభావం చూపించే ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కూడా రద్దు చేశారు.

More Telugu News