Bike accident: అతివేగం... అనర్థం! అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. వీడియో ఇదిగో!

  • రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం సజ్జనార్ ట్వీట్
  • తొందరగా వెళ్లాలనే ఆత్రం ప్రమాదానికి దారితీస్తుందంటూ హితవు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Bike Rider falls off Flyover due to overspeed TSRTC MD Sajjanar shares the Video of Road accident

తొందరగా వెళ్లాలనే ఆత్రం వల్లో, థ్రిల్ కోసమనో మితిమీరిన వేగంతో వెళితే ప్రమాదం తప్పదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. అతివేగం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటూ ఓ ప్రమాద వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం సజ్జనార్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘‘తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతారు.. జాగ్రత్త’’ అంటూ హెచ్చరించారు.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఓ ప్రమాదానికి సంబంధించినవి.. బైక్ పై ఓ యువకుడు మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పడం కనిపిస్తోంది. ఈ ప్రమాదం ఫ్లై ఓవర్ పై జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బైకర్.. మూలమలుపు వద్ద బైక్ కంట్రోల్ కాక డివైడర్ ను ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు ఫ్లై ఓవర్ పైనుంచి ఎగిరి కిందపడ్డాడు. అక్కడితో ఈ వీడియో ఎండ్ అయింది. ప్రమాదం తర్వాత బాధిత యువకుడి పరిస్థితి ఏంటనే విషయం వీడియోలో కనిపించలేదు. ఈ విషయంపై సజ్జనార్ కూడా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది చెవినపెట్టరంటూ ఓ నెటిజన్ విమర్శించాడు.

More Telugu News