Hakimpet Sports School: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు

  • ఆటవిడుపు పేరుతో ఓఎస్డీ హరికృష్ణ అసభ్య చేష్టలు
  • వేధింపుల ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్
  • వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి
Officer Sexually Harasses Girls At Hakimpet Sports School In Hyderabad

హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఓఎస్డీ హరికృష్ణను తప్పిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాఫ్తు జరిపిస్తామని, ఒకటి రెండు రోజుల్లోనే దోషులను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు, నాయకులు, ఉద్యోగులు.. ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలు వైరల్ కావడంతో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయడం, చర్యలు తీసుకోవాలంటూ సూచించడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు.

అసలేం జరిగిందంటే..
హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలు వివిధ ఆటల పోటీలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు. హాస్టల్ లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్ లోకి అధికారులైనా సరే రాత్రిపూట పురుషులు వెళ్లడం నిషేధం.. అయితే, ఓఎస్డీ మాత్రం హాస్టల్ ఆవరణలోని గెస్ట్ హౌస్ లోనే మకాం పెట్టారని బాలికలు చెప్పారు. సాయంత్రం పూట ఆటవిడుపు పేరుతో బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వివరించారు. అర్ధరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగి సహా ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సదరు మహిళా ఉద్యోగితో ఓఎస్డీకి అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై ఓ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సూచించారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై ఓఎస్డీ హరికృష్ణ స్పందిస్తూ.. సెలక్షన్ సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, స్కూలుకు వస్తున్న మంచిపేరును చూసి ఓర్వేలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరికృష్ణ వివరించారు.

More Telugu News