Team India: విండీస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన టీమిండియా ఓపెనర్లు... సిరీస్ సమం

  • టీమిండియా, వెస్టిండీస్ నాలుగో టీ20
  • అమెరికాలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు
  • 17 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
  • జైశ్వాల్ 84 నాటౌట్, గిల్ 77 రన్స్
Team India wins 4th T20I against WI

వెస్టిండీస్ తో నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్ స్వైరవిహారం చేశారు. భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లే 165 పరుగులు జోడించడంతో టీమిండియా విజయం నల్లేరుపై నడకే అయింది.

జైస్వాల్, గిల్ పోటీలు పడి అర్ధసెంచరీలు సాధించడంతో 179 పరుగుల లక్ష్యాన్ని భారత్ 1 వికెట్ నష్టపోయి కేవలం 17 ఓవర్లలోనే ఛేదించింది. గిల్ 47 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 77 పరుగులు చేసి అవుట్ కాగా... జైస్వాల్, తిలక్ వర్మ (7 నాటౌట్) మరో 3 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ను ముగించారు. 

జైస్వాల్ 51 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సులతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జైస్వాల్, గిల్ ధాటికి విండీస్ బౌలర్లు నిస్సహాయంగా మిగిలిపోయారు. విండీస్ బౌలర్లలో రొమారియా షెపర్డ్ కు ఒక వికెట్ దక్కింది. 

ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసింది. రేపు (ఆగస్టు 13) జరిగే చివరిదైన ఐదో టీ20లో ఎవరు గెలిస్తే వారే సిరీస్ విజేత అవుతారు. ఈ సిరీస్ లోని మొదటి 3 మ్యాచ్ లు వెస్టిండీస్ లో జరగ్గా, చివరి రెండు టీ20లకు అమెరికా వేదికగా నిలుస్తోంది. నాలుగో టీ20 మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్ హిల్ లో జరిగింది. చివరి టీ20 మ్యాచ్ కూడా ఇక్కడి సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ లోనే జరగనుంది.

More Telugu News