Pawan Kalyan: ఓటు వేసి గెలిపిస్తే పారిపోతావా? రాజీనామా చెయ్!: విశాఖ ఎంపీపై ఊగిపోయిన పవన్ కల్యాణ్

Pawan Kalyan demand visakha mp to resgin
  • ఓయూ విద్యార్థులు ఉద్యమించినట్లు ఉత్తరాంధ్ర విద్యార్థులు గళమెత్తాలని సూచన
  • దేవాలయాలు, మసీదులు, చర్చి స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం
  • విశాఖ నగరాన్ని వైసీపీ నేతలు చెడగొడుతున్నారని ఆరోపణ
  • దోచుకుంటూ వెళ్తే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్‌గా మారుతుందని హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడోరోజైన శనివారం విశాఖలోనే పర్యటించారు. సిరిపురం జంక్షన్ దగ్గరి సీబీసీఎన్సీ భూములను పరిశీలించారు. ఈ భూములను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆక్రమించారని ఆరోపించారు. ఇక్కడి నాలుగు ఎకరాల భూమిని అధికార పార్టీ కబ్జా చేసిందని ధ్వజమెత్తారు. భూములను పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... అధికార పార్టీ నేతలు దేవాలయాలు, మసీదులు, చర్చి స్థలాలు అన్నింటినీ కబ్జా చేస్తున్నారన్నారు. కబ్జాలకు పాల్పడితే జనసేన అడ్డుకుంటుందన్నారు.

విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని, అలాంటి నగరాన్ని వైసీపీ నేతలు చెడగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇలా దోపిడీ చేస్తేనే తరిమేశారని, ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా దోచుకుంటూ వెళ్తే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్‌గా మారుతుందని, కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులు దీనిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ కోసం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎలా పోరాటం చేశారో, అలాగే ఉత్తరాంధ్ర ఏయూ యూనివర్సిటీ విద్యార్థులు వైసీపీ నేతల దోపిడీపై గళమెత్తాలన్నారు.

ఇక్కడి ఎంపీ సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు నీకు ఓటు వేసి గెలిపిస్తే... ఇక్కడి నుండి పారిపోతావా? అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ప్రశ్నించారు. ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నీకు చేతకాకుంటే రాజీనామా చెయ్.. మళ్లీ ఎన్నికలు వస్తాయి.. అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. నీ అక్రమాలను, ఉత్తరాంధ్ర దోపిడీని మేం బయటకు తెస్తామని ఎంపీని హెచ్చరించారు. దేవాలయ, చర్చి, మసీదు ఆస్తులను దోచేశారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు.

స్వయంగా జగన్ దొంగ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. సీఎంవోలోనే దొంగ సంతకాలు చేయడం దారుణమన్నారు. అధికారులను బెదిరిస్తున్నారేమో.. కానీ వారి ఒత్తిళ్లకు అధికారులు లొంగిపోవద్దని హితవు పలికారు. రౌడీలు, గూండాలు రాజ్యమేలితే పాలన ఇలాగే ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర భూములను ఎవరూ దోపిడీ చేయవద్దని తాము పోరాటం చేస్తున్నామన్నారు.

విశాఖ వంటి కీలక పట్టణం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టిలో ఉందన్నారు. ఈ నగరం దేశ భద్రతకు చాలా కీలకమన్నారు. తనలాంటి వారు బయటకు వస్తే ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని, తాను ప్రజలకు అభివాదం చేయవద్దు.. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయవద్దు.. ఇవేం ఆంక్షలు? అని పవన్ ప్రశ్నించారు.
Pawan Kalyan
YS Jagan
Visakhapatnam
Janasena

More Telugu News