Roja: నువ్వు కోర్టు కంటే గొప్పవాడివా? నువ్వుండేది బంజారాహిల్స్ కొండపైనే కదా?: పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా ధ్వజం

Roja lashes out at Pawan Kalyan over Rishi Konda visit
  • రిషికొండపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా మండిపాటు  
  • విశాఖను క్రైమ్ సిటీగా పవన్, చంద్రబాబులు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
  • చిరంజీవి, పవన్ కల్యాణ్ ఉండేది బంజారాహిల్స్ కొండలపైనే కదా? అని నిలదీత
  • పవన్ రీమేక్ స్టార్.. ప్యాకేజీ స్టార్ అంటూ విసుర్లు
  • చంద్రబాబు చెప్పినట్లు వినే బానిస అన్న రోజా
  • పక్క పార్టీల జెండా మోయడానికి పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు పవన్ అని విమర్శ
రిషికొండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోడి వెధవలు, బోడి ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజు నిప్పులు చెరిగారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారన్నారు. విశాఖను క్రైమ్ సిటీగా పవన్, చంద్రబాబులు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుండి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కొండలపై కట్టడాలు వద్దని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారన్నారు. మరి చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇళ్లు బంజారాహిల్స్ కొండపైనే ఉన్నాయి కదా? అన్నారు. సుప్రీం కోర్టు రిషికొండలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు కంటే పవన్ కల్యాణ్ గొప్పవాడా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ కాదని.. రీమేక్ స్టార్.. పవర్ స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూముల్లో కట్టడాలతో అభివృద్ధి చేస్తుంటే పవన్ ఎందుకు అడ్డుపడుతున్నారన్నారు. ఆయనకు ఎందుకు అంత బాధ అన్నారు. నిర్మాణాలు ఆపేయాలని కోర్టు చెప్పలేదన్నారు.

తాము కట్టే ప్రతి కట్టడానికి అనుమతి తీసుకున్నామన్నారు. ఇది అక్రమ కట్టడం కాదని, ప్రభుత్వ కట్టడమన్నారు. రిషికొండ పేరుతో పవన్ హడావిడి చేశారన్నారు. చంద్రబాబు చెప్పినట్లు వినే బానిస పవన్ కల్యాణ్ అన్నారు. అసలు జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని అడగడానికి నువ్వెవరు అని నిలదీశారు. జగన్ కన్ను తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. ఇక నీవు కనీసం ఎమ్మెల్యేవు కాదు... పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేరు.. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి ఏమిటని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాకముందే తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడని, అక్కడి నుండే ఇప్పుడూ పరిపాలన చేస్తున్నాడన్నారు. 

చంద్రబాబు ప్రజల డబ్బును వృథా చేశారన్నారు. ఆయన తన కరకట్ట ఇంటికి రూ.40 కోట్లు, సీఎం ఆఫీస్ ఫర్నీచర్ కు రూ.10 కోట్లు, హైదరాబాద్‌లోని తన నివాసాలన్నింటికి కలిపి రూ.50 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇలా మొత్తం రూ.187 కోట్లు ఖర్చు చేశారని, దీనిపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కానీ జగన్ మాత్రం సీఎం కాకముందే తాడేపల్లిలో సొంతగా ఇల్లు కట్టుకొని, ఇప్పుడు కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఐనా జగన్ ఎన్ని ఇళ్లు కట్టుకుంటే నీకేమిటని ప్రశ్నించారు. తమవంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జనసైనికులు ఏం చేయలేరన్నారు. గీతం యూనివర్సిటీ కబ్జా జనసేనానికి కనిపించలేదా? అని నిలదీశారు.

జగన్ ఇక్కడకు ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ ఇలా ఎన్నో కంపెనీలు తీసుకు రావడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. కానీ ప్రభుత్వం దోచుకుంటుందంటూ విశాఖ ప్రజలను పవన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నీలాంటి వారు ఎంత అడ్డుపడినా.. ఎంత ఊగిపోయినా జగన్‌ను ఏం చేయలేరన్నారు. అసలు విశాఖను దోచుకున్నదే టీడీపీ నేతలు అన్నారు.

పక్క పార్టీల జెండా మోయడానికి పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన అసలు పవన్ కల్యాణా? పనికిమాలిన కల్యాణా? అని ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారో పవన్ చెప్పకుండా ఈ విమర్శలు ఏమిటన్నారు. పవన్‌కు 55 ఏళ్లు వచ్చాయని, కానీ అమిత్ షాకు చెప్పి ఆడిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. కొండపైకి వచ్చినప్పుడు చంద్రబాబు చెప్పులు వేయించిన విషయం అమిత్ షాకు గుర్తుందన్నారు. దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీయే జగన్‌ను ఆడించాలి.. ఓడించాలనుకుంటే ఏం కాలేదన్నారు. కానీ బానిసవైన నువ్వు ఏం చేస్తావని ప్రశ్నించారు. ఇక్కడ కనీసం ఇళ్లు, ఆఫీస్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ప్రశ్నించావా? అని అడిగారు.
Roja
Pawan Kalyan
rishi konda
Visakhapatnam
YS Jagan

More Telugu News