Health: ఆహారం జీర్ణం కావట్లేదా.. ఇలా చేసిచూడండి!

  • భోజన సమయాల్లో మార్పులతో జీర్ణ సమస్యలు
  • ఎసిడిటీ, గ్యాస్ తదితర ఇబ్బందులు
  • వంటింటి చిట్కాలతో వీటికి చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు
Simple solutions for Digestion problem

సమయానుకూలంగా తినే భోజనం చక్కగా జీర్ణం కావడంతో పాటు ఒంటికి పడుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే, ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో భోజన వేళలు మారిపోతున్నాయి. వేళ కాని వేళ భోజనం చేయడంతో చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ తదితర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలూ జీర్ణ సమస్యలకు కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వంటింటి చిట్కాలతో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. 

  • భోజనం చేశాక కొద్దిగా సోంపు నమిలితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచేందుకు సోంపు తోడ్పడుతుందని చెబుతున్నారు. అజీర్తితో బాధపడుతుంటే ఒక గ్లాస్ వాటర్ లో స్పూన్ సోంపు వేసి 5 నిమిషాలు మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఎసిడిటీని కూడా దూరం చేసుకోవచ్చని చెప్పారు.
  • ఆహారాన్ని అరిగించే గుణం నిమ్మకాయలో ఉంది. కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తే ఓ గ్లాసు నిమ్మరసం తాగితే సెట్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • జీలకర్రలోని పొటాషియం, విటమిన్ ఏ, సీ, కాల్షియం, ఐరన్.. ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. మార్నింగ్ సిక్ నెస్, కడుపు నొప్పి, విరేచనాలకు దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగితే మంచి రిజల్ట్ కనిపిస్తుందని తెలిపారు.
  • లాలాజలంతో పాటు పైత్య రసం ఉత్పత్తిని పెంచేందుకు అల్లం తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అల్లం ముక్కను చిన్నగా తురిమి గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నపుడు తాగడం వల్ల తిన్న అజీర్తిని దూరం చేసుకోవచ్చని చెప్పారు.
  • పుదీనా, తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ ఆకులను నీటిలో మరిగించి, చల్లార్చి తాగితే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయని నిపుణులు పేర్కొన్నారు.

More Telugu News