IIT graduates: సుందర్ పిచాయ్ నుంచి నారాయణమూర్తి దాకా.. ఐఐటీ పూర్వ విద్యార్థుల్లో మల్టీ మిలియనీర్లు వీరే!

  • పిచాయ్ ఆస్తుల విలువ 1.3 బిలియన్ డాలర్లు
  • ఐఐటీ పూర్వ విద్యార్థుల్లో అత్యంత సంపన్నుడు జయ్ చౌధురి
  • ఆయన నెట్ వర్త్ 16.3 బిలియన్ డాలర్లు
  • వినోద్ ఖోస్లా నెట్ వర్త్ 6 బిలయన్ డాలర్లు
From Sundar Pichai to Narayana Murthy the IIT graduates who are now billionaires

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీలలో చదవాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఏటా లక్షలాదిగా జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరైతే అందులో సగానికంటే తక్కువ మంది అడ్వాన్స్ డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అందులో కేవలం 20 వేల నుంచి 25 వేల మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. వారిలో సీటు దక్కేది కేవలం పదిహేను వేల మందికి (ఈ ఏడాది 17,385) మాత్రమే. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. దేశవిదేశాలలోని ప్రముఖ కంపెనీలలో ఐఐటీ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడమే దీనికి నిదర్శనం. సొంతంగా కంపెనీ స్థాపించి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మొదలుకొని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దాకా.. ఐఐటీ పూర్వవిద్యార్థుల్లో చాలామంది వివిధ కంపెనీలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అందులో కొంతమంది వివరాలు..

సుందర్ పిచాయ్, ఆల్ఫాబెట్ సీఈవో
తమిళనాడులో పుట్టిన సుందర్ పిచాయ్ ఇంటర్ వరకూ సొంత రాష్ట్రంలోనే చదివారు. ఆపై ఐఐటీ ఖరగ్ పూర్ లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పట్టా, పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. వర్సిటీలో బెస్ట్ రీసెర్చ్ స్కాలర్ గా పేరుతెచ్చుకున్నారు. అనంతరం మెకిన్సే అండ్ కంపెనీలో ఇంజనీర్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2004లో గూగుల్ లో చేరిన పిచాయ్.. 2019 నాటికి సీఈవో స్థాయికి చేరుకున్నారు.
పిచాయ్ నెట్ వర్త్: 1.31 బిలియన్ డాలర్లు (టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు)
జీతం: 226 మిలియన్ డాలర్లు

ఎన్.ఆర్.నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు
కర్ణాటకలోని సిద్లఘట్ట టౌన్ లో జన్మించిన నాగవర రామారావు నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులలో ఒకరు. ఎన్ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐటీ కాన్పూర్ లో మాస్టర్స్ డిగ్రీని 1969లో పూర్తిచేశారు. ఆపై ఐఐఎం అహ్మదాబాద్ లో రీసెర్చర్ గా కెరియర్ ప్రారంభించారు. 1981 లో మరో ఆరుగురు సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ తో కలిసి ఇన్ఫోసిస్ ను స్థాపించారు. తన భార్య సుధామూర్తి ఇచ్చిన రూ.10 వేలే ఇన్ఫోసిస్ మూలధనమని పలు ఇంటర్వ్యూలలో నారాయణమూర్తి చెప్పారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నెట్ వర్త్ 4.3 బిలియన్ డాలర్లు.

జయ్ చౌధురి, జెస్కాలర్ సీఈవో
వారణాసి ఐఐటీ విద్యార్థి జయ్ చౌధురి.. ఐఐటీ పూర్వవిద్యార్థుల్లోకెల్లా అత్యంత ధనవంతుడిగా పేరొందారు. ఐఐటీలో డిగ్రీ తీసుకున్నాక అమెరికా వెళ్లి సిన్సినాటి యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ జెస్కాలర్ ను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఫోర్బ్స్ 400 ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. 2021 నాటి లెక్కల ప్రకారం జయ్ చౌధురి నెట్ వర్త్ 16.3 బిలియన్ డాలర్లు.

భరత్ దేశాయ్, సింటెల్ కో ఫౌండర్
ఐఐటీ పూర్వవిద్యార్థుల్లో సంపన్నుల జాబితాలోని మరో పేరు భరత్ దేశాయ్.. ఐఐటీ బాంబే నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన భరత్.. సింటెల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. కంపెనీకి చైర్మన్ గానూ కొనసాగుతున్నారు. కెన్యాలో పుట్టిన భరత్.. పెరిగింది, చదువుకున్నది మాత్రం భారతదేశంలోనే.. అనంతరం కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం భరత్ దేశాయ్ నెట్ వర్త్.. 1.5 బిలియన్ డాలర్లు.

సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్, ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు
ఆన్ లైన్ బుక్ స్టోర్ గా మొదలైన ఫ్లిప్ కార్ట్ ను క్రమంగా ఈ కామర్స్ ప్లాట్ ఫాంగా తీర్చిదిద్ది సచిన్, బిన్నీ బన్సాల్ లు మల్టీ మిలియనీర్లుగా ఎదిగారు. వీరిద్దరూ ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులే. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం... సచిన్ బన్సాల్ నెట్ వర్త్ 1.3 బిలియన్ డాలర్లు కాగా బిన్నీ బన్సాల్ నెట్ వర్త్ 1.4 బిలియన్ డాలర్లు.

వినోద్ ఖోస్లా, సన్ మైక్రోసిస్టం కో ఫౌండర్
ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త, సన్ మైక్రో సిస్టం సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా కూడా ఐఐటీ పూర్వ విద్యార్థే.. ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసి, అమెరికాలో స్థిరపడ్డారు. వెంచర్ ఇన్వెస్టర్ గా ఖోస్లా వెంచర్స్ స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. డైసీ సిస్టం వ్యవస్థాపకుడిగా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గానూ వ్యవహరించారు. ప్రస్తుతం వినోద్ ఖోస్లా నెట్ వర్త్ 6 బిలయన్ డాలర్లు (ఫోర్బ్స్ నివేదిక)

More Telugu News