Mallikarjun Kharge: నీరవ్ మోదీ అన్నంత మాత్రాన ఆయనను సస్పెండ్ చేసేస్తారా?: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Khage response on modi remarks by Adhir
  • నీరవ్ అన్న అధిర్ ను లోక్ సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్
  • నీరవ్ అంటే శాంతి అని అర్థమన్న అధిర్ రంజన్ చౌదురి
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజ్యసభ ఛైర్మన్ పై ఉందన్న ఖర్గే
లోక్ సభలో కాంగ్రెస్ విప్ అధిర్ రంజన్ చౌదురిని సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆయన కేవలం నీరవ్ మోదీ అని మాత్రమే అన్నారని... దానికే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసేస్తారా అని ప్రశ్నించారు. నీరవ్ అంటే హిందీలో శాంతి అని అర్థమని చెప్పారు. రాజ్యసభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అధిర్ రంజన్ చౌదురిని నిన్న లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రధాని మోదీని విమర్శించడంతో పాటు కేంద్ర మంత్రుల ప్రసంగాలను అడ్డుకుంటున్నారంటూ ఆయనను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ... ఇది నమ్మశక్యంకాని నిర్ణయమని, అప్రజాస్వామికమని అన్నారు. మరోవైపు అధిర్ రంజన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీని నీరవ్ మోదీ పేరుతో కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు. 
 
మణిపూర్ హింస విషయంలో మోదీ... నీరవ్ (శాంతి)గా కూర్చున్నారని తాను అన్నానని... అంటే ఆయన మౌనంగా కూర్చున్నారని అర్థమని అధిర్ చెప్పారు. తన వ్యాఖ్యలు ఆయనను కించపరిచినట్టుగా మోదీ భావించకూడదని అన్నారు. కానీ, మోదీ అనుచరులు ప్రివిలేజ్ కమిటీపై ఒత్తిడి తెచ్చినట్టు, ఆ తర్వాత తనను సస్పెండ్ చేసినట్టు తను తెలిసిందని చెప్పారు. 

ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ కు ఖర్గే ఒక విన్నపం చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పాటు, బీఏసీలో ఉన్న అధిర్ ను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి బాధ్యత మీపై ఉందని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు.
Mallikarjun Kharge
Congress
Rajya Sabha

More Telugu News