Jagan: ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి?: సీఎం జగన్ మండిపాటు

  • మొన్నటి పుంగనూరు ఘటన చూస్తే చాలా బాధనిపించిందన్న జగన్
  • శవ రాజకీయాలకు సైతం వెనుకాడటం లేదని మండిపాటు
  • పుంగనూరులో 47 మంది పోలీసులకు గాయాలు చేశారని ఆరోపణ
  • తాము అందిస్తున్న పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదని వ్యాఖ్య
cm ys jagan political counter chandrababu and pawan kalyan

తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పారు. ఈ రోజు అమలాపురంలో వైఎస్సార్‌‌ సున్నా వడ్డీ పథకం నిధులను మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా?” అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? అని ప్రశ్నించారు. 
ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిలదీశారు. ఆయన కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారని సెటైర్లు వేశారు.

‘‘తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. ఇందుకోసమే చంద్రబాబుకు అధికారం ఇవ్వాలట. మొన్నటి పుంగనూరు ఘటన చూస్తే చాలా బాధనిపించింది. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి” అని జగన్ మండిపడ్డారు. పుంగనూరులో 47 మంది పోలీసులకు గాయాలు చేశారని, ఒక పోలీసు కన్ను పోగొట్టారని ఆరోపించారు. శవ రాజకీయాలకు సైతం వెనుకాడటం లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఇంకా ఎక్కువ చేస్తారని ఆరోపించారు.

More Telugu News