No Confidence Motion: మేం వాకౌట్ చేశాకే మణిపూర్‌పై మోదీ మాట్లాడారు.. విరుచుకుపడిన విపక్షాలు

Modi spoke about manipur just after our walkout Opposition slams PM
  • ప్రసంగంలో మొదటి 90 నిమిషాలు మణిపూర్ ఊసే ఎత్తలేదన్న టీఎంసీ ఎంపీ
  • ఈ దెబ్బతో ‘ఇండియా’ విజయంపై నమ్మకం కుదరిందని వ్యాఖ్య
  • మోదీ ‘కాంగ్రెస్ ఫోబియా’తో బాధపడుతున్నారన్న ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్
మణిపూర్ హింసపై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నోరే రాలేదని విపక్షాలు మండిపడ్డాయి. అవిశ్వాస తీర్మానంపై మోదీ ప్రతిస్పందనను తప్పుబట్టాయి. 90 నిమిషాలపాటు మోదీ మణిపూర్ ఊసే ఎత్తలేదని, తాము సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మాత్రమే ఆయన మాట్లాడారని దుమ్మెత్తిపోశాయి.  ఈ మేరకు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మోదీ తన ప్రసంగంలో తొలి 90 నిమిషాలు మణిపూర్ పేరే ఎత్తలేదని, చివరికి తాము సభను వాకౌట్ చేసిన తర్వాత మాత్రమే ఆయన మణిపూర్ గురించి మాట్లాడారని విమర్శించారు. 

‘‘మీరేసుకున్న టెఫ్లాన్ పూత పోయింది. మెరుపు మాయమైంది. ఈ రోజు మీ ప్రసంగం తర్వాత భారత్‌ను ‘ఇండియా’ గెలుస్తుందన్న నమ్మకం కలిగింది’’ అని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల మొత్తం ప్రధాని మోదీ రాజ్యసభకు డుమ్మా కొట్టారని ఒబ్రెయిన్ విమర్శించారు. మణిపూర్‌పై లోక్‌సభలో ఆయన నాలుగంటే నాలుగే నిమిషాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. అది కూడా ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప ఆయన మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి మించి మరెవరూ పార్లమెంటను ఇంతగా అవమానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ కూడా మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మోదీ తన ప్రసంగం మొత్తాన్ని కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఆయనకు ‘కాంగ్రెస్ ఫోబియా’ పట్టుకుందని ఎద్దేవా చేశారు. మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో చాలావరకు సమయాన్ని మణిపూర్ గురించి కాకుండా కాంగ్రెస్‌ను తిట్టడానికే వినియోగించుకున్నారని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు.
No Confidence Motion
Narendra Modi
Derek O'Brien
TMC
Congress

More Telugu News