Vishan-Lakshmi Menon: అదేమైనా బెర్ముడా ట్రయాంగిలా? డీకోడ్ చేయడానికి..?: లక్ష్మీ మీనన్‌తో పెళ్లి వార్తలపై తీవ్రంగా స్పందించిన విశాల్

  • ఇలాంటి తప్పుడు వార్తలకు స్పందించాల్సిన పనిలేదన్న విశాల్
  • ఓ అమ్మాయి ప్రస్తావన ఉంది కాబట్టే స్పందించాల్సి వచ్చిందని వివరణ
  • ఆమె ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం
  • సమయం వచ్చినప్పుడు ఆ కబురేదో తానే చెబుతానన్న కోలీవుడ్ నటుడు
Vishal reacts to wedding news with Lakshmi Menon

నటి లక్ష్మీ మీనన్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తుండడంపై కోలీవుడ్ నటుడు విశాల్ స్పందించాడు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని కొట్టిపడేశాడు. ఈ రూమర్లలో ఓ అమ్మాయి గురించి ప్రస్తావన ఉంది కాబట్టే స్పందించానని, లేదంటే ఆ అవసరం తనకు లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఓ పోస్టు షేర్ చేశాడు. 

‘‘సాధారణంగా ఇలాంటి తప్పుడు వార్తలకు నేను స్పందించను. ఎందుకంటే అది అనవసరమని నాకు తెలుసు. అయితే, లక్ష్మీ మీనన్‌తో నా వివాహంపై రూమర్లు వస్తుండడంతో స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ విషయంలో ఓ అమ్మాయి ప్రస్తావన ఉంది కాబట్టి. ఆమె ఒక నటి కాబట్టి. ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం, ఆమె ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. నేను ఎవరిని పెళ్లాడబోతున్నాను? సంవత్సరం, తేదీని డీకోడ్ చేయడానికి ఇదేమీ బెర్ముడా ట్రయాంగిల్ కాదు. సమయం వచ్చినప్పుడు ఆ సంగతేదో నేనే చెబుతాను’’ అని అందులో రాసుకొచ్చాడు. కాగా, విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ స్పందించి వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు.

More Telugu News