Chandrababu: ఆ కుటుంబాలను క్షోభకు గురిచేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు.. చంద్రబాబు హెచ్చరిక

  • అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో వందలాదిమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు
  • ఇప్పటి వరకు 81 మంది అరెస్ట్
  • బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు
  • అరెస్టైన వారిని వీలైనంత త్వరగా బయటకు తెస్తామని హామీ
  • తండ్రిలా అండగా ఉంటానని భరోసా
Chandrababu Warns Who Filed Cases Against TDP Workers

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధితుల కుటుంబాలతో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇటీవల అంగళ్లు, పుంగనూరులలో రేకెత్తిన ఘర్షణల్లో వందలాదిమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుపైనా హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటి వరకు 12 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 81 మందిని అరెస్ట్ చేశారు. 

ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తండ్రిలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడబోవని అన్నారు. అక్రమ అరెస్టులు తనను బాధించాయని, న్యాయపోరాటం ద్వారా అందరినీ వీలైనంత త్వరగా బయటకు తీసుకొస్తామని చెప్పారు. అక్రమ కేసులు బనాయించి వందల కుటుంబాలను క్షోభకు గురిచేసిన వారిని వదిలిపెట్టబోమని, ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

More Telugu News