BRS: సీఎం కేసీఆర్ ను అవమానించిన బండి సంజయ్ పై మేమేం చర్యలు తీసుకోవాలి?: కేటీఆర్

Telangana Minister KTR fires on Bandi Sanjay comments in parliment
  • ప్రధాని ఇంటిపేరును అవమానిస్తే రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని గుర్తుచేసిన మంత్రి
  • పార్లమెంట్ లో బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్న
  • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై స్పందించిన మంత్రి
‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.. మరి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించిన బండి సంజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?.. ఆయనపై మేమేం చర్యలు తీసుకోవాలి’’ అంటూ తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత కేటీఆర్ మోదీ సర్కారును ప్రశ్నించారు. పార్లమెంట్ లో కేసీఆర్ ను అవమానిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా ఏం చర్యలు తీసుకోబోతున్నారని నిలదీశారు.

దొంగల అందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉంటుందంటూ రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతల ఫిర్యాదుతో రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. అయితే, ఈ శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. దీంతోపాటు బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. బండి సంజయ్ పై బీజేపీ ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుందని, తాము ఏం చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
BRS
KTR
Bandi Sanjay
Parliament
cm kcr

More Telugu News