Pawan Kalyan: జగన్... కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడించకపోతే చూడు!: పవన్ ఫైర్

Pawan Kalyan fires on CM Jagan
  • విశాఖలో జనసేన ర్యాలీ
  • పవన్ వాడీవేడి ప్రసంగం
  • ఒక్కడు వచ్చాడు నాశనం చేయడానికి అంటూ సీఎం జగన్ పై ధ్వజం
  • వైసీపీ నేతల అక్రమాల ఫైల్ ను కేంద్రానికి ఇస్తానని వెల్లడి
  • అప్పుడేం జరుగుతుందో చూడండి అంటూ వార్నింగ్
వైజాగ్ జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఎంతోమంది మేధావులు ప్రజాస్వామ్య రక్షణ కోసం కష్టపడితే... ఒక్కడు వచ్చాడు నాశనం చేయడానికి అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

జగన్... నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయవు, పోలీసులను, అధికారులను బెదిరిస్తావు... అందరూ నీకు లోబడి ఉండాలని భావించే వ్యక్తివి నువ్వు అంటూ తీవ్ర విమర్శలు  చేశారు. జగన్ గుర్తుంచుకో... కేంద్రంతో నిన్ను ఆడించకపోతే చూడు... మీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను... అప్పుడేం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. 

వైసీపీ గెలిస్తే విశాఖలో కొండలతో సహా దోచుకుంటాడు అని తాను 2019లోనే చెప్పానని, ఇప్పుడు చూడండి ఏంచేస్తున్నాడో అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

"మీరు ఎన్నుకుంది దోపిడీలు చేసుకునే వ్యక్తిని. ఇలాంటి వాళ్లను ఐదేళ్లు భరించలేరు అని అందుకే గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించవద్దని చెప్పాను. జగన్ ముఠా తెలంగాణ ప్రాంతాన్ని కూడా దోచుకుంటే అక్కడి వారు తన్ని తరిమేశారు. విశాఖలో రుషికొండను తవ్వేశారు. తుపానుల నుంచి కాపాడే కొండను చెక్కి పడేశారు. ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారు. వైసీపీ దోపిడీలు అడ్డుకోలేరా? వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి... ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి... మీ కోసం నేను నిలబడతా" అని స్పష్టం చేశారు.

పవన్ ప్రసంగం హైలైట్స్...

  • జగన్ ఒక డెకాయిట్. కాగ్ లెక్కల్లో కొన్ని వేల కోట్ల రూపాయలకు లెక్కాపత్రం లేదని తేలింది. ఆ డబ్బు ఏమైంది?
  • కీలక పదవులన్నీ ఒకే కులానికి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి.
  • మద్యం మీద జగన్ సంపాదన రూ.30 వేల కోట్లు. 2024లో జగన్ కు మరోసారి అవకాశం ఇస్తారా?
  • బొగ్గు రంగు నలుపు. దాన్ని సర్ఫ్ తో కడిగినా దాని రంగు మారదు... నల్లగానే ఉంటుంది. జగన్ కూడా అంతే. ఎన్ని చెప్పినా మారని ఆ మనిషిని ఇంకోసారి గెలిపిస్తే ఒక్క ముక్క మిగల్చడు.
  • ఇంకా ఎంత డబ్బు తింటావ్ జగన్? ఏం చేసుకుంటావ్ జగన్ అంత డబ్బు? నీకెందుకింత డబ్బు పిచ్చి?
  • టీచర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదంటారు... కానీ నష్టాల్లో ఉన్న బైజూస్ అనే కంపెనీకి మాత్రం రూ.500 కోట్లు ఇస్తారు.
  • జగన్ నాయకుడు కాదు... ఒక కమీషన్ ఏజెంట్ లాంటివాడు. ఏ పని జరిగినా నాకెంత అని అడుగుతాడు. 
  • మహాత్ముడిని పక్కనపెట్టుకుని ఫొటోలతో ప్రచారం చేసుకోవడం కాదు. పంచాయతీ నిధులు ఎక్కడికి మళ్లించావో చెప్పు?
  • క్లాస్-4 స్థాయి ఉద్యోగానికి కూడా పోలీస్ క్లియరెన్సు అడుగుతారు. కానీ 38 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రి అవుతాడు. 
  • ప్రశ్నించకపోతే నష్టపోయేది ప్రజలే. ఈజిప్టులో హోస్నీ ముబారక్ అనే పాలకుడిని దేశం తిరుగుబాటుతో గద్దె దింపింది. ప్రజలందరూ కలిసికట్టుగా కదం తొక్కితే జగన్ ను కూడా దించేయొచ్చు.
Pawan Kalyan
Jagan
Visakhapatnam
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News