daily walk: ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించాలంటే.. నడవాల్సిందే మరి!

  • నిత్యం కనీసం 4,000 అడుగులు అయినా నడవాలి
  • అదనంగా ప్రతి 1,000 అడుగుల నడకతో మరిన్ని ప్రయోజనాలు
  • ముందస్తు మరణం ముప్పు, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది
  • తాజా అధ్యయనంలో తెలుసుకున్న పరిశోధకులు
Forget 10000 Steps Heres How Much Science Says You Actually Need to Walk

ఆరోగ్యం విలువ నేడు ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఆరోగ్యం కోసం ఏదైనా చేస్తున్నారా? అంటే మెజారిటీ ప్రజలు నో అనే సమాధానమే ఇస్తారు. నేడు ఎక్కువగా చూస్తున్న ఆరోగ్య సమస్యల్లో బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం కనిపిస్తాయి. వీటికి తోడు కేన్సర్ మహమ్మారి కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. వీటన్నింటికీ కారణాలను చూస్తే నిశ్చలమైన జీవనం అనేది ఉమ్మడిగా కనిపిస్తుంది. అంటే, ఎలాంటి వ్యాయామం చేయకపోవడం. 


వ్యాయామంతో మన శరీర జీవక్రియలు చురుగ్గా మారతాయి, వ్యర్థాలు బయటకు పోతాయి. చెడు కొవ్వులు కరిగిపోతాయి. మానసిక పరమైన ఉల్లాసం లభిస్తుంది. వీటి ప్రభావం ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ 4,000 అడుగులు నడిచిన వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. చురుకైన జీవన శైలి కోసం నిత్యం ఈ మాత్రం అయినా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. 

రోజుకు 4,000 అడుగుల వరకే నడవాలా? అన్న సందేహం వచ్చిందా? ప్రతీ 1,000 అడుగులు అదనంగా నడవడం వల్ల ముందస్తు మరణం ముప్పు 15 శాతం తగ్గుతుందట. నడవడం, ఇంటి పనులు కూడా ఇందులో లెక్కలోకి వస్తాయి. గతంలో ప్రచురితమైన 17 అధ్యయన ఫలితాలను విశ్లేషించిన పరిశోధక బృందం వాటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర వివరాలను విడుదల చేసింది. గత అధ్యయనాలను పరిశీలించినప్పుడు.. మరింత నడవడం ద్వారా ముందస్తు మరణ రిస్క్ తగ్గుతున్నట్టు గుర్తించారు. అలా అని రోజులో 20,000 అడుగుల వరకు నడవాల్సిన అవసరం లేదంటున్నారు. 

ముఖ్యంగా గుండె జబ్బుల తో మరణించే ముప్పు రోజులో 4,000 అడుగులు నడిచే వారిలో గణనీయంగా తగ్గుతున్నట్టు తెలుసుకున్నారు. కనీసం 2,500 అడుగులు నడిచినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. వయసుల ఆధారంగానూ ఈ ఫలితాల్లో వైరుధ్యం కనిపించింది. 60 ఏళ్లు దాటిన వారు రోజులో 6,000 నుంచి 10,000 అడుగులు నడిస్తే మరణించే ముప్పు 42 శాతం తగ్గుతుందట. అదే 60 ఏళ్లలోపు వారు రోజులో 7,000 నుంచి 13,000 అడుగులు నడిచినప్పుడు ముందస్తు మరణ రిస్క్ 49 శాతం తగ్గుతుందని తెలుసుకున్నారు. అందుకని కనీసం రోజులో 4,000 అడుగులు అయినా వేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం!

More Telugu News