UPI Lite: గుడ్ న్యూస్: పిన్ లేకుండా యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు

  • రూ.200 నుంచి రూ.500కు పరిమితి పెంపు
  • ఆఫ్ లైన్ లోనూ చెల్లింపులకు వీలు
  • మరింత సౌకర్యంగా చెల్లింపులకు మార్గం
  • ఆర్ బీఐ తాజా నిర్ణయం
pay up to Rs 500 via UPI Lite without PIN transaction limit up from Rs 200

ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా, ఏది కొనుగోలు చేసినా యూపీఐతో చెల్లింపులు చేయడం అలవాటుగా మారిపోయింది. నగదును వినియోగించే వారు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. యూపీఐలో లైట్ అనే మరో ఫీచర్ కూడా ఉంది. దీని  కింద పిన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే రూ.200 వరకు వర్తకులకు క్యూఆర్ కోడ్ విధానంలో చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ పరిమితిని రూ.500కు పెంచుతూ ఆర్ బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే ఇకమీదట రూ.500 వరకు చెల్లింపుల మొత్తం ఉంటే యూపీఐ లైట్ ఫీచర్ కింద మరింత సులభంగా చెల్లింపులు చేయవచ్చు. పిన్ నంబర్ నమోదు చేయకపోవడం ఇందులోని సౌకర్యంగా చెప్పుకోవాలి. 

ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వచ్చేసింది. యూజర్లకు డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మరింత సౌకర్యంగా మార్చేందుకు, మరింత మందికి ఈ సాధనం చేరువ అయ్యేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. మొబైల్ లో యూపీఐ వ్యాలెట్ అయిన ఫోన్ పే, పేటీఎం తదితర యాప్ లలో ఏదో ఒకటి ఉండాలి. దీనికి బ్యాంక్ ఖాతా అనుసంధానం చేసుకోవాలి. వ్యాలెట్ కు మనీని లోడ్ చేసుకోవాలి. గరిష్ఠంగా యూపీఐ లైట్ కింద రూ.2,000 లోడ్ చేసుకోవచ్చు. ఇలా లోడ్ చేసుకున్న మొత్తాన్ని ఆఫ్ లైన్ చెల్లింపులకు సైతం వినియోగించుకోవచ్చు. రోజువారీ చిన్న చెల్లింపులకు ఎలాంటి అవరోధాలు లేకుండా, మరింత వేగంగా, సులభంగా అయ్యేందుకు ఆర్ బీఐ ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్యలు ఉన్న చోట.. నెట్ అవసరం లేకుండా చెల్లింపులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.

More Telugu News