Nandigama: బిడ్డల కోసం 20 ఏళ్ల పాటు తపన.. ముగ్గుర్ని ప్రసవించిన కొన్ని రోజులకే మహిళ మృతి

Nandigama Woman dies days after giving birth to triplets
  • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాద ఘటన
  • 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తపించి తల్లయిన మహిళ
  • ఆసుపత్రిలో ముగ్గురు బిడ్డలకు జననం
  • ప్రసవం తరువాత కొన్ని రోజులకే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి
  • తీవ్ర విషాదంలో కూరుకుపోయిన మహిళ కుటుంబం
బిడ్డల కోసం ఆ మహిళ ఏకంగా 20 ఏళ్ల పాటు తపించింది. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చింది. కానీ, ఇంతలోనే ఆ కుటుంబాన్ని విధి కర్కశంగా కాటేసింది. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన ఆ తల్లి బిడ్డల బోసినవ్వులు కూడా చూడకుండానే తనువు చాలించింది. 

నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఖాసిం ఆటో డ్రైవర్. ఆ దంపతులు పిల్లల కోసం రెండు దశాబ్దాల పాటు తపించాక నజీరా గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది. పదిరోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. 

మరోవైపు, నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది. పిల్లల కోసం తపించిన ఆమె వారిని కళ్లారా చూసుకోకుండానే కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. బుధవారం కుటుంబసభ్యుల రోదనల నడుమ ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. తన స్థాయికి మించి ఖర్చు చేసినా బిడ్డలు తల్లిలేని వారు కావడంతో ఖాసిం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాడు. బిడ్డలైనా తనకు దక్కాలని భగవంతుడిని వేడుకుంటున్నాడు.
Nandigama
Andhra Pradesh
Vijayawada

More Telugu News