G. Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మజ్లిస్ మధ్యవర్తిత్వం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపణ

  • లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మూడు పార్టీలు ఒక్కటేనని స్పష్టమైందన్న కిషన్
  • రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణ
  • కేంద్రంలో సంకీర్ణమని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా
Kishan Reddy fires at BRS and Congress

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ఒక్కటేనని స్పష్టమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. రెండు పార్టీల మధ్య మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం నెరపుతోందన్నారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్ అప్పుడు కీలక భాగస్వామిగా మారుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారని, కానీ ఆయనవి పగటి కలలే అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, కాబట్టి కాంగ్రెస్‌కు ఓటు వేసినా బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లే అన్నారు. మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. చర్చ సందర్భంగా మూడు పార్టీలు ఒక్కటేనని తేలిపోయిందన్నారు.

More Telugu News