Roja: తన వల్ల కాదనే చిరంజీవి వెళ్లిపోయారు... ఇప్పుడు తమ్ముడిపై ప్రేమతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారు: మంత్రి రోజా విమర్శలు

Roja reveals Behind Chiranjeevis commens on AP government
  • చిరంజీవి చెబితే పని చేసే పరిస్థితుల్లో జగన్ లేడన్న రోజా 
  • చిరంజీవికి ఏం అర్హత ఉందని సినిమా టిక్కెట్ ధరలు పెంచమని అడిగారని ఆగ్రహం
  • విభజన సమయంలో చిరంజీవి ఏం చేశారని నిలదీత
  • జగన్ చేసిన అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదని వ్యాఖ్య
వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి చెబితే పని చేసే పరిస్థితుల్లో జగన్ లేడని అన్నారు. గడపగడపకూ వచ్చి చూస్తే తమ ప్రభుత్వం రోడ్లు వేసిందో? లేదో? తెలుస్తుందన్నారు. చిరంజీవికి ఏం అర్హత ఉందని సినిమా టిక్కెట్ ధరలు పెంచమని అడిగారని నిలదీశారు. హీరోలందరూ కలిసి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదని, పవన్ కల్యాణ్, చిరంజీవి మాత్రమే ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అప్పుడే ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చట్టం చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా ఆయన ఒక్క ప్రాజెక్టు అయినా చేపట్టారా? అని ఆగ్రహించారు. హోదా గురించి ఆ రోజే పోరాడాల్సిందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకొని, చంద్రబాబు జెండాను మోస్తున్నారని ఆరోపించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

జగన్ చేసిన అభివృద్ధిని గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు. ఇంతటి అభివృద్ధి ఇతర సీఎంలు ఎవరైనా చేశారని చూపించగలరా? అని తాను చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతున్నానని రోజా అన్నారు. చిరంజీవి ఏ పరిస్థితుల్లో మాట్లాడారో కానీ ఆయన మాట్లాడింది మాత్రం సరైనది కాదన్నారు. సినిమా ఫంక్షన్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని, అలా చేస్తే ఊరుకునేది లేదన్నారు.

చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదన్నారు. గతంలో పీఆర్పీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇక తన వల్ల కాదని రాజకీయాలు వదిలి తిరిగి సినిమాల్లోకి వెళ్లారన్నారు. కానీ తన తమ్ముడు పవన్ కల్యాణ్‌పై ప్రేమతో ఇలా మాట్లాడుతున్నారనేది తన ఉద్దేశ్యమని, రాజకీయాల్లోకి మాత్రం వస్తారని అనుకోవడం లేదన్నారు. పీఆర్పీ సమయంలో చాలామంది నేతలకు హామీ ఇచ్చారని, కానీ వారు ఇతర పార్టీల్లోకి వెళ్లడం ద్వారా జూనియర్లుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి వస్తే తమకు ఇబ్బంది లేదని, ఇద్దరు సన్నాసులు రాసుకుంటే బూడిద మాత్రమే రాలుతుందని ఎద్దేవా చేశారు. తమ్ముడిపై ప్రేమతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు.
Roja
Chiranjeevi
Andhra Pradesh
Pawan Kalyan

More Telugu News