Chandrababu: అంగళ్లులో నా హత్యకు కుట్ర జరిగింది: చంద్రబాబు సంచలన ఆరోపణలు

  • అంగళ్లు ఘర్షణలపై సీబీఐతో విచారణ చేయించాలన్న చంద్రబాబు
  • తనను చంపడానికి ప్రయత్నిస్తున్నదెవరో తేలాలని డిమాండ్
  • ఈ హత్యాయత్నానికి పోలీసులూ సహకరించారని ఆరోపణ
  • ఇప్పుడు తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపాటు
  • వైసీపీ దోపీడీని, అవినీతిని ఎదుర్కొంటానని వ్యాఖ్య
chandrababu press meet in vizianagaram

అంగళ్లు ఘర్షణల విషయంలో తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. టీడీపీ కేడర్‌‌పైనా దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. పైగా ఇప్పుడు తనపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని ఫైరయ్యారు.

ఈ రోజు విజయనగరంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. “మమ్మల్ని చంపి రాజకీయాలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అంగళ్లు అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో తేలాలి” అని డిమాండ్ చేశారు. 

‘‘తంబళ్లపల్లి, అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు. కానీ ఇప్పుడు నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నన్ను తిరగనివ్వడంలేదు. ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 

ఒక పథకం ప్రకారం తనను అడ్డుకుని, హత్య చేయడానికి ప్రయత్నించారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. ఎక్కడికెళ్లినా తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను పారిపోవాలా?  ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న నేనే పారిపోతే ఇక అర్థమేముంది? వైసీపీ ప్రభుత్వం చేసే దోపీడీని, అవినీతిని నేను ఎదుర్కొని తీరుతాను” అని తేల్చి చెప్పారు.

More Telugu News