Ramya Krishnan: అలాంటి ఫాలోయింగ్ కొద్దిమందికే సాధ్యం: రమ్యకృష్ణ

ramya krishna speaks about narasimha movie and rajini chiru
  • చిరంజీవి, రజనీకాంత్‌లకు ఉన్న ఫాలోయింగ్‌ కొద్దిమందికే ఉంటుందన్న రమ్యకృష్ణ
  • భవిష్యత్‌లో ఇలాంటి స్టార్స్ వస్తారో రారో తెలియదని వ్యాఖ్య
  • నరసింహాలో నటించడమే తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయమని వెల్లడి
ఎప్పుడో 1999లో వచ్చిన ‘నరసింహా’ చిత్రంలో కలిసి నటించారు సూపర్‌‌స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ. ఆ సినిమాలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి అభినయించారు. మళ్లీ ఇప్పుడు, దాదాపు 24 ఏళ్ల తర్వాత ‘జైలర్’ సినిమా కోసం జోడీకట్టారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రమ్యకృష్ణ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

‘నరసింహా’లో నీలాంబరి పాత్ర తన కెరియర్‌‌ను మలుపుతిప్పిందని రమ్యకృష్ణ చెప్పారు. ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయినా? సెకండ్ హీరోయినా? అని ఆలోచించలేదని అన్నారు. తాను రజనీకాంత్ సినిమాలో భాగం కావాలని అనుకున్నానని, అందుకే ఓకే చెప్పానని చెప్పారు. తన జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అదేనని అన్నారు.

బాహుబలి గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని చెప్పారు. ‘‘బాహుబలిలో నటించడానికి కొన్ని షరతులు పెట్టాను. రాత్రిపూట షూటింగ్ చేయనని, కొన్నీ రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని చెప్పాను. కానీ ఇలాంటి వాటన్నింటికీ డైరెక్టర్ రాజమౌళి ఒప్పుకున్నారు” అని వివరించారు. 

ఇక చిరంజీవి, రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. కొద్ది మంది మాత్రమే అలాంటి స్టార్‌‌డమ్‌ను సొంతం చేసుకోగలరని అన్నారు. చిరంజీవి, రజనీకాంత్ కనిపిస్తే పెద్దల నుంచి పిల్లల దాకా అందరూ ఎంజాయ్ చేస్తారని అన్నారు. అలాంటి ఫాలోయింగ్ కొద్దిమందికే సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి స్టార్స్ వస్తారో రారో కూడా తెలియదని చెప్పారు. ఒకవేళ వచ్చినా ఇంత సుదీర్ఘ కాలం సార్ట్‌డమ్‌ను కొనసాగిస్తారో లేదో చెప్పలేనని అన్నారు.

ఇక ‘జైలర్’ రేపు రిలీజ్ కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆసక్తిని పెంచగా.. ‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ సూపర్‌‌హిట్ అయింది.
Ramya Krishnan
Rajinikanth
Jailer
Chiranjeevi
Baahubali
Rajamouli

More Telugu News