Chiranjeevi Vs Kodali Nani: చిరంజీవిపై చేసిన కామెంట్లకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ మెగా ఫ్యాన్స్ ఆందోళన.. గుడివాడలో ఉద్రిక్తత

Chiranjeevi fans fires on Kodali Nani and conducted protest rally
  • సినిమా పరిశ్రమలోని పకోడీగాళ్లు అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
  • గుడివాడలో నిరసన ర్యాలీ నిర్వహించిన మెగా ఫ్యాన్స్
  • పలువురు అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ గుడివాడలో అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీని చేపట్టారు. జై చిరంజీవ... కొడాలి నాని డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, మెగా ఫ్యాన్స్ కు మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవితో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసు వాహనానికి అడ్డంగా రోడ్డుపై పడుకుని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మెగా ఫ్యాన్స్ ను నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

మరోవైపు విజయవాడలో కూడా మెయిన్ రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో కొడాలి నానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు. 

అసలు ఏం జరిగిందంటే... ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని... పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన ప్రశ్నించారు. దీనిపై కొడాలి నాని స్పందిస్తూ తనదైన శైలిలో నోటికి పని కల్పించారు. సినిమా పరిశ్రమలోని పకోడీగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో, మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
Chiranjeevi Vs Kodali Nani
Gudivada
Chiranjeevi
Tollywood
Kodali Nani
YSRCP

More Telugu News