Surya Kumar Yadav: సూర్యా భాయ్ విశ్వరూపం... మూడో టీ20 టీమిండియాదే!

  • గయానాలో టీమిండియా × వెస్టిండీస్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 రన్స్
  • 17.5 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించిన టీమిండియా
  • 44 బంతుల్లో 83 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
  • సిరీస్ లో విండీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించిన భారత్
Surya Kumar Yadav brilliant knock drives Team India a comprehensive victory against West Indies

సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో టీమిండియా విజృంభించి ఆడింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో విండీస్ ను అదరగొట్టింది. సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్ మార్క్ ఆటతో విశ్వరూపం ప్రదర్శించిన వేళ... మూడో టీ20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్ లో అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి ఉంటే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ 3-0తో విండీస్ పరం అయ్యేది. కానీ టీమిండియా గెలవడంతో విండీస్ ఆధిక్యం 2-1కి తగ్గింది. 

మూడో టీ20 విషయానికొస్తే... ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

లక్ష్యఛేదనలో టీమిండియా 34 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. కెరీర్ లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 1 పరుగుకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (6) సైతం నిరాశపరిచాడు. ఈ దశలో సూర్యకుమార్, తిలక్ వర్మ జోడీ అద్భుతంగా ఆడి మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పింది. సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 83 పరుగులు చేయడం ఛేజింగ్ లో హైలైట్ గా నిలిచింది. 

తెలుగుతేజం తిలక్ వర్మ తన ఫామ్ ను ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాడు. సూర్యా భాయ్ అవుటైనప్పటికీ, తిలక్ వర్మ... కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

తిలక్ వర్మ 37 బంతుల్లో 49 పరుగులు చేసి అజేయంగా నిలవగా, హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. పాండ్యా విన్నింగ్ షాట్ గా సిక్స్ కొట్టడం విశేషం. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెద్ మెకాయ్ 1 వికెట్ తీశారు. ఇక, ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 12న జరగనుంది.

More Telugu News