Shiv Sena: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన శివసేన ఎంపీ

  • ఎంపీ నవనీత్ రాణా, భర్తను అరెస్ట్ చేసిన అంశాన్ని ప్రస్తావించిన మహా సీఎం తనయుడు
  • తనకు హనుమాన్ చాలీసా మొత్తం తెలుసునంటూ పారాయణం
  • బాలా సాహెబ్ భావజాలాన్ని వదిలేశారంటూ ఉద్ధవ్‌పై నిప్పులు
Shiv Sena MP Shrikant Shinde recites Hanuman Chalisa in Lok Sabha

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మంగళవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా 'హనుమాన్ చాలీసా'ను పఠించారు. ఉద్ధవ్ థాకరేపై నిప్పులు చెరిగారు.  గత ఏడాది ముంబైలోని ఉద్ధవ్ నివాసం వెలుపల 'హనుమాన్ చాలీసా' పారాయణం చేస్తామని ప్రకటించినందుకు అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త రవి రాణాను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని షిండే తనయుడు ప్రస్తావిస్తూ, తనకు హనుమాన్ చాలీసా మొత్తం తెలుసు అంటూ శ్లోకాలు చదవడం ప్రారంభించారు. అయితే సభాపతి ఆయనను మధ్యలో ఆపి, ప్రసంగాన్ని కొనసాగించాలని కోరారు.

2019లో ప్రజలు శివసేన, బీజేపీకి కలిపి అధికారాన్ని ఇచ్చారని, కానీ ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్‌తో కలిశారన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని భావించాడని, దీంతో బాల్ థాకరే భావజాలాన్ని, ఆయన హిందుత్వ విధానాన్ని పక్కన పెట్టారన్నారు. హిందుత్వ భావజాలాన్ని అమ్మేసి, బాలా సాహెబ్ భావజాలానికి దూరమయ్యారని దుయ్యబట్టారు. శివసేన, కాంగ్రెస్ కలిసిపోతాయని కలలో కూడా ఊహించలేదన్నారు. చివరకు కరసేవకులపై దాడి చేసిన సమాజ్ వాది పార్టీతోను కలిశారన్నారు. అందుకే I.N.D.I.A. కూటమితో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టారని ఉద్ధవ్‌పై ఆగ్రహించారు.

'అవినీతికి పర్యాయపదంగా మారిన కూటమికి యూపీఏ పేరును మార్చి I.N.D.I.A.గా పెట్టారని ఎద్దేవా చేశారు. ఇది ఎన్డీయే వర్సెస్ I.N.D.I.A. మాత్రమే కాదని, పథకాలు వర్సెస్ స్కామ్‌లు అని అభివర్ణించారు. వీరంతా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారని, వారికి నాయకుడు లేడని, విధానం లేదన్నారు. ఈ టీమ్‌కి కెప్టెన్‌ లేనందున ఇక్కడి ప్రతి నాయకుడు ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు.

More Telugu News